Rajahmundry: రైలులో బిర్యానీ తిని 9 మందికి తీవ్ర అస్వస్థత
రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు, టీ, కాఫీ, బిర్యానీ అంటూ రకరకాల ఆహారాలను ప్రయాణికులు తింటుంటారు. ఈ క్రమంలో వైజాగ్ రైల్వేస్టేషన్‌తో పలు రైళ్లలో ఆహార పదార్థాలను తిని అస్వస్థకు గురయ్యారు. ముఖ్యంగా ఆయా చోట్ల బిర్యానీ తిన్న తొమ్మిది మంది తీవ్ర అస్వస్థతకు గురైనట్లు అధికారులు తెలిపారు. అస్వస్థతకు గురైన వారని చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం జీజీహెచ్‌కు తరలించారు. పట్నా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైలులో వెళ్తున్న 15మంది విశాఖ స్టేషన్‌లో బిర్యానీ కొనుగోలు చేసి తిన్నారు. అరగంట తర్వాత బిర్యానీ తిన్న వారిలో ఐదుగురికి వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
దిబ్రూగఢ్-కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌లో నలుగురు
దిబ్రూగఢ్-కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌లో ఏడుగురు ప్రయాణికులు బిర్యానీ కొనుగోలు చేశారు. వీరిలో నలుగురు ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని కూడా రైల్వే అధికారులు రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌లో దించి జీజీహెచ్‌లో చేర్పించారు. రెండు రైళ్లలో అస్వస్థతకు గురైన వారు కూడా విశాఖ నుంచి వచ్చిన రైళ్లలోని ప్రయాణికులే కావడం గమనార్హం. ప్రయాణ సమయాల్లో వీలైనంత వరకు ఎక్కడి పడితే అక్కడ తినకపోవడమే మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై ప్రయాణికులు మరోసారి మండిపడుతున్నారు. రైల్వేలో పరిశుభ్రత ఉండదనే విషయం మరోసారి రుజువైనట్లు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.