Rajasthan: అంగన్‌వాడీ ఉద్యోగాలు ఇప్పిస్తామని.. 20 మంది మహిళలపై అత్యాచారం
రాజస్థాన్‌లోని సిరోహి మున్సిపాలిటీ పరిధిలో దారుణం జరిగింది. అంగన్‌వాడీ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఉద్యోగాలు ఇప్పిస్తామని మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్, మాజీ కమిషనర్ దాదాపు 20 మంది మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత మహిళల ఫిర్యాదు మేరకు పోలీసులు మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్, మాజీ కమిషనర్‌పై కేసు నమోదు చేశారు. మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్, మాజీ కమిషనర్ తనతోపాటు మరో 20 మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారని గత నెల ఓ మహిళ ఆరోపించింది. ఈ ఘటనపై వీరద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జనవరి 30న నమోదైన ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. చైర్మన్ మహేంద్ర మేవాడా, అప్పుడు కమిషనర్ మహేంద్ర చౌదరి, వారి స్నేహితులు మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఫొటోలు, వీడియోలు తీసి బెదిరింపులు
నిందితులు మహిళలను బ్లాక్ మెయిల్ చేసేందుకు వారి ఫొటోలు, వీడియోలు కూడా తీశారని ఆ మహిళ ఆరోపించారు. నిందితులపై 376డి (గ్యాంగ్ రేప్) సహా ఐపీసీలోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, డిప్యూటీ ఎస్పీ (డీఎస్పీ) కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డీఐజీ (పాలి) ఓం ప్రకాశ్ తెలిపారు. ఈ వ్యవహారాన్ని డీఎస్పీ స్థాయి అధికారి నిష్పక్షపాతంగా విచారిస్తున్నారని తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న వ్యక్తులపై త్వరలోనే ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది.