రాజస్థాన్ కాంగ్రెస్ లో లుకలుకలు .. సొంత పార్టీ దిశగా సచిన్ పైలట్
కర్ణాటక గెలుపును ఆస్వాదిస్తున్న కాంగ్రెస్ అధిష్టానానికి ఆ ఆనందం ఎక్కువ సేపు నిలువలేకపోతోంది. దీనికి కారణం రాజస్థాన్ కాంగ్రెస్ లో ఏర్పడిన లుకలుకలే. త్వరలో తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్,ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలను ఎలాగైనా ఒడిసి పట్టుకోనాలని ఏఐసీసీ భావిస్తోంది. ఇక రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లో అయితే అధికారాన్ని తిరిగి నిలబెట్టుకునేందుకు హస్తం నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి కీలక దశలో పార్టీకి సచిన్ పైలెట్ రూపంలో గట్టిదెబ్బ తగిలే అవకాశముంది. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ ప్రభుత్వ విధానాలను గత కొంత కాలంగా ఆ రాష్ట్ర మాజీ పీసీసీ చీఫ్ సచిన్ పైలట్ తీవ్రంగా విమర్శిస్తున్నారు.
ప్రగతిశీల కాంగ్రెస్ లేదా రాజ్ జన సంఘర్ష్ పేరుతో ప్రజల్లోకి పైలెట్
కాంగ్రెస్ అధిష్ఠానం తనను సరిగ్గా పట్టించుకోవడం లేదనే విషయమై సచిన్ పైలట్ గుర్రుగా ఉన్నారని ఆ రాష్ట్రంలో జోరుగా చర్చ సాగుతోంది. వీలైనంత త్వరలో సొంతంగా పార్టీ పెట్టే ఆలోచనలో పైలెట్ ఉన్నట్లు తెలుస్తోంది. తన తండ్రి రాజేష్ పైలట్ వర్థంతి జూన్ 11న, దౌసాలో తన కొత్త పార్టీ గురించి పైలట్ కీలక ప్రకటన చేయచ్చని అంతా అనుకుంటున్నారు. మరోవైపు కొత్త పార్టీకి ప్రగతిశీల కాంగ్రెస్ లేదా రాజ్ జన సంఘర్ష్ పార్టీ పేర్లను పరిశీలిస్తున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే, నూతన పార్టీని ఓ కొలిక్కి తీసుకురావడంలో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఐప్యాక్ సహకారం తీసుకోనున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.