Chandrababu: రెండేళ్లలో రాయలసీమలో ఉక్కు ఉత్పత్తికి శ్రీకారం
ఈ వార్తాకథనం ఏంటి
వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని సున్నపురాళ్లపల్లెలో రూ.16,350 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ప్రతిష్ఠాత్మక జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం శంకుస్థాపన చేశారు. జేఎస్‌డబ్ల్యూ సంస్థ ఛైర్మన్ సజ్జన్ జిందాల్, కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మతో కలిసి సిమెంట్ వేసి నిర్మాణ పనులను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం, 2028 జూలై 3 నాటికి ఈ ప్లాంట్‌లో ఉక్కు ఉత్పత్తి ప్రారంభమవుతుందని, రాయలసీమ బిడ్డగా ఇందుకు తాను హామీ ఇస్తున్నానని పేర్కొన్నారు. అదే కార్యక్రమంలో రూ.20,350 కోట్ల పెట్టుబడితో చేపట్టనున్న 3,850 మెగావాట్ల సామర్థ్యమున్న జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు కూడా ఆయన ప్రారంభోత్సవం చేశారు.
వివరాలు
ఉక్కు రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి..
అలాగే విజయనగరం జిల్లాలో 1,166 ఎకరాల విస్తీర్ణంలో జేఎస్‌డబ్ల్యూ సంస్థ అభివృద్ధి చేస్తున్న పారిశ్రామిక పార్కును వర్చువల్ విధానంలో ప్రారంభించారు. సున్నపురాళ్లపల్లెలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి, ఒకప్పుడు కరవుకు ప్రతీకగా నిలిచిన రాయలసీమ ఇకపై సమృద్ధిగా నీటి వనరులతో కళకళలాడే ప్రాంతంగా రూపుదిద్దుకుంటుందని అన్నారు. ప్రస్తుతం కియా కార్లు, రాయల్ ఎన్‌ఫీల్డ్, హీరో ద్విచక్ర వాహనాలు, డ్రోన్లు, యుద్ధ విమానాల తయారీతో పాటు గ్రీన్ ఎనర్జీ రంగానికి రాయలసీమ ప్రధాన కేంద్రంగా ఎదుగుతోందని పేర్కొన్నారు. ఆర్సెలార్ మిత్తల్, వైజాగ్ స్టీల్, జేఎస్‌డబ్ల్యూ వంటి సంస్థల భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో ప్రముఖ ఉక్కు రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
వివరాలు
గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు ఆగస్టు 15 నాటికి శంకుస్థాపన..
రాయలసీమ రైతుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మదనపల్లెలో ఏర్పాటు చేయనున్న గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు ఆగస్టు 15 నాటికి శంకుస్థాపన చేయనున్నట్లు కూడా చంద్రబాబు వెల్లడించారు. గత ప్రభుత్వాల పాలనలో రాష్ట్రానికి రాజధాని ఏదనే విషయమే స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు. ప్రజలు గర్వపడే విధంగా అమరావతిని అభివృద్ధి చేసి ఆదర్శ రాజధానిగా నిలబెడతామని స్పష్టం చేశారు. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ, వైఎస్ కుటుంబం పాలన కారణంగా రాయలసీమ అభివృద్ధి దెబ్బతిన్నదని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు.