LOADING...
Heavy Rains: ఉత్తరాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. ఉత్తరాఖండ్‌, యూపీలో రెడ్ అలర్ట్

Heavy Rains: ఉత్తరాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. ఉత్తరాఖండ్‌, యూపీలో రెడ్ అలర్ట్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 10, 2026
01:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తరాది రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదులు, వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో చోటుచేసుకున్న కొండచరియల విరిగిపడిన ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. గురువారం ఒక్కరోజే పలు ప్రాంతాల్లో 10 మందికి పైగా మరణించినట్లు అధికారులు తెలిపారు. దిల్లీలోనూ భారీ వర్షాలు కురిశాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో 160 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు గుజరాత్‌లోని సూరత్ నగరంలో రహదారులు నీటమునిగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

వివరాలు 

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల హెచ్చరిక

శుక్రవారం ఉత్తరాఖండ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలకనంద, మందాకిని నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రుద్రప్రయాగ్ జిల్లాలో పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అన్ని పాఠశాలలను మూసివేశారు. హిమాచల్‌ప్రదేశ్‌లోనూ వర్షాల ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. భారీ వర్షాల కారణంగా సాధారణ జనజీవనం దెబ్బతింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం 75 రహదారులు దెబ్బతిని రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే 29 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసమవడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

వివరాలు 

చార్‌ధామ్ యాత్రకు అంతరాయం

ఉత్తరకాశి జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో గంగోత్రి జాతీయ రహదారి మూసివేయాల్సి వచ్చింది. దీంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ పరిణామంతో చార్‌ధామ్ యాత్రకు కొన్ని గంటలపాటు అంతరాయం ఏర్పడి, యాత్రికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు రెడ్ అలర్ట్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా గాజియాబాద్‌, మేరఠ్‌, హాపూర్‌, బులంద్‌షహర్‌, బాఘ్‌పత్‌, ముజఫర్‌నగర్‌, మొరాదాబాద్ జిల్లాల్లోని పాఠశాలలకు శుక్రవారం సెలవు ప్రకటించారు. ప్రజలు అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు రావద్దని, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Advertisement

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాల బీభత్సం

Advertisement