Reliance: ఏలూరులో లక్ష కోట్ల కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుకు శ్రీకారం
ఈ వార్తాకథనం ఏంటి
ఏలూరు జిల్లా చింతలపూడి, రేచెర్ల బొగ్గు గనుల అభివృద్ధికి కీలక ముందడుగు పడింది. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఇటీవల నిర్వహించిన ఈ-వేలంలో ఈ రెండు బొగ్గు గనులను రిలయన్స్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సుమారు రూ.లక్ష కోట్ల పెట్టుబడితో భూగర్భ కోల్ గ్యాసిఫికేషన్(Underground Coal Gasification) ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని సంస్థ నిర్ణయించింది. ఇటీవల రిలయన్స్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి ప్రాజెక్టు రూపురేఖలు,అమలు కార్యాచరణపై వివరాలు వెల్లడించారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు అమల్లోకి వస్తే ప్రత్యక్షంగా,పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధితో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతం లభించనుంది.
వివరాలు
3,130.61 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు
చింతలపూడి బ్లాక్ సుమారు 1,200 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది.
ఇందులో జీ-12 గ్రేడ్‌కు చెందిన సుమారు 904.94 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు గుర్తించారు.
దీనికి సమీపంలోని రేచెర్ల బ్లాక్ 2,225 హెక్టార్లలో విస్తరించి ఉండగా, అక్కడ జీ-13 గ్రేడ్‌కు చెందిన 2,225.67 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు అంచనా వేశారు.
ఈ రెండు గనుల్లో కలిపి మొత్తం 3,130.61 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
ఈ ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలు భూమి ఉపరితలం నుంచి కనీసం 600 మీటర్ల లోతులో ఉండటంతో సంప్రదాయ పద్ధతుల్లో తవ్వకాల నిర్వహణకు భారీ వ్యయం అవుతుంది.
వివరాలు
దేశంలోనే తొలి అండర్‌గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు
లోతు పెరిగే కొద్దీ తవ్వకాల ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉండటంతో, బొగ్గును వెలికితీయకుండా భూగర్భంలోనే గ్యాసిఫికేషన్ ప్రక్రియ ద్వారా వినియోగించే సాంకేతికతను అమలు చేయాలని నిర్ణయించారు.
చింతలపూడి, రేచెర్ల గనుల్లో చేపట్టనున్న ఈ అండర్‌గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు దేశంలోనే తొలి ప్రాజెక్టుగా నిలవనుంది.
ప్రాజెక్టు నిర్మాణం, మౌలిక వసతుల ఏర్పాటును దశలవారీగా చేపట్టి, 2029 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.