Andhra pradesh: నేటి నుంచి పెరగనున్న భూముల రిజిస్ట్రేషన్ విలువలు.. కొన్నిచోట్ల తగ్గింపు.. మరికొన్ని చోట్ల యథాతథం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్ విలువల్లో మార్పులు, చేర్పులు జరిగాయి.
గత ప్రభుత్వం అడ్డగోలుగా పెంచిన రిజిస్ట్రేషన్ విలువలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం పునరాలోచించింది.
తాజా సవరించిన రిజిస్ట్రేషన్ విలువలు శనివారం నుండి అమల్లోకి రానున్నాయి.
కొన్ని ప్రాంతాల్లో విలువలు తగ్గించగా, మరికొన్ని చోట్ల పెంచారు. కొన్ని ప్రాంతాల్లో గత విలువలను అలాగే కొనసాగించారు.
సగటున రిజిస్ట్రేషన్ విలువలు 20% పెరిగాయి. నివాస స్థలాలు, వాణిజ్యాభివృద్ధి చెందిన ప్రాంతాల ఆధారంగా ఈ మార్పులు చేసారు.
వివరాలు
విజయవాడలో 3% నుంచి 9% వరకు పెంపు
గుంటూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో అధికంగా ఉన్న విలువలను తగ్గించారు. ఉదాహరణకు, గుంటూరు శివారు నల్లపాడు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో ఎకరా భూమి రిజిస్ట్రేషన్ విలువ రూ.1.96 కోట్లు ఉండగా,దాన్ని రూ.30 లక్షలకు తగ్గించారు.
అలాగే,సుద్దపల్లి డొంకలో ఎకరా భూమి విలువ రూ.4.35 కోట్లుగా ఉండగా,దాన్ని రూ.1.99 కోట్లకు తగ్గించారు.
విజయవాడలో రిజిస్ట్రేషన్ విలువలు 3% నుంచి 9% వరకు పెరిగాయి.
విశాఖపట్టణంలోనూ పలు ప్రాంతాల్లో భూముల విలువలు పెరిగాయి. అనకాపల్లి పట్టణంలో విలువలను యథాతథంగా ఉంచి, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో 24% నుంచి 32% వరకు పెంచారు.
కాకినాడలో కొన్ని ప్రాంతాలను వాణిజ్య ప్రదేశాలుగా గుర్తించి, వైసీపీ ప్రభుత్వ హయాంలో గజం ధరను రూ.42,000గా నిర్ణయించగా, ప్రస్తుతం దాన్ని రూ.22,000కి తగ్గించారు.
వివరాలు
సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రద్దీ
ఏలూరు జిల్లాలో రిజిస్ట్రేషన్ విలువలు 15% పెరిగాయి.అలాగే, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, ప్రకాశం జిల్లాల్లోనూ భూముల ధరలు పెరిగాయి.
రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తీవ్ర రద్దీ కనిపించింది.
గురువారం, శుక్రవారం రెండురోజుల్లో కలిపి సుమారు రూ.220 కోట్ల మేర రిజిస్ట్రేషన్ ఛార్జీలుగా ప్రభుత్వ ఖజానాకు వచ్చాయి.
భూముల రిజిస్ట్రేషన్ విలువల సవరింపుతో పెరిగే ఆర్థిక భారం దృష్టిలో పెట్టుకుని ప్రజలు పెద్దఎత్తున ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కార్యాలయాలకు తరలివచ్చారు.
అధిక రద్దీ కారణంగా సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సర్వర్ వ్యవస్థలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి.
వివరాలు
అర్ధరాత్రి వరకు రిజిస్ట్రేషన్లు
ఫిబ్రవరి 1 నుంచి పెరగనున్న రిజిస్ట్రేషన్ ఛార్జీల నేపథ్యంలో, విజయవాడ పటమట సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం రాత్రి 11 గంటల వరకు రిజిస్ట్రేషన్లు జరిగాయి.
శుక్రవారం ఒక్కరోజే 217 రిజిస్ట్రేషన్లు జరిగినట్లు సబ్-రిజిస్ట్రార్ రేవంత్ తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక ఆదాయాన్ని తీసుకువచ్చే విజయవాడ పటమట సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో, జనవరి 30న సర్వర్ స్తంభించినా 146 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ పూర్తి చేసినట్లు వెల్లడించారు.