Rohini Acharya: నాపై చెప్పులతో దాడి చేయబోయారు.. లాలూ కుమార్తె సంచలన పోస్ట్..!
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో విభేదాలు మళ్లీ బహిరంగంగా బయటపడ్డాయి. పార్టీ నుంచి, కుటుంబం నుంచి తాను పూర్తిగా దూరమవుతున్నట్లు ప్రకటించిన లాలూ కుమార్తె రోహిణీ ఆచార్య తాజాగా తన అన్న తేజస్వీ యాదవ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తేజస్వీ, అలాగే ఆయన సన్నిహితుల కారణంగానే కుటుంబం నుంచి బయటకు నెట్టివేయబడ్డానని ఆమె ఆదివారం సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెట్టారు.
వివరాలు
నన్ను అనాథను చేశారు.
''నిన్న ఓ కుమార్తె, ఓ సోదరి, ఓ గృహిణి, తల్లి అవమానాన్ని ఎదుర్కొంది. నన్ను దుర్భాషలతో దూషించారు. కొట్టేందుకు చెప్పులు కూడా ఎత్తారు. నేను నా ఆత్మగౌరవం కోసం ఎలాంటి రాజీ పడలేదు. సత్యం ముందు మోకరిల్లలేదు. అందుకే ఇలాంటి అవమానాలు భరించాల్సి వచ్చింది. ఏడుస్తున్న సోదరిని, తల్లిదండ్రులను వదిలి వెళ్లాల్సిన పరిస్థితి నాకొచ్చింది. మా అమ్మ ఇంటిని వదిలి బయటకు రావాల్సి వచ్చింది. నన్ను అనాథను చేశారు. మీరు ఎప్పుడూ నా మార్గాన్ని అనుసరించకండి. రోహిణీ లాంటి కుమార్తె, సోదరి ఏ ఇంట్లోనూ ఉండకూడదని కోరుకుంటున్నా'' అని తొలుత భావోద్వేగపూరిత పోస్టు చేశారు.
వివరాలు
నా భర్త,అత్తమామల అనుమతి లేకుండా కిడ్నీ ఇచ్చాను
''నన్ను మురికిదానిని అని తిట్టారు.కానీ అదే 'మురికి' కిడ్నీని నేను నా తండ్రికి ఇచ్చాను. కోట్లు,టికెట్లు తీసుకున్నాకే కిడ్నీ ఇచ్చానని కూడా మాట్లాడుతున్నారు.పెళ్లైన కూతుళ్లు,సోదరీమణులకు నేను చెబుతున్నది ఒక్కటే:మీ పుట్టింట్లో అన్నయ్య లేదా కుమారుడు ఉన్నప్పుడు మీరు కిడ్నీ ఇచ్చి తండ్రిని కాపాడతామని భావించకండి.ఆ ఇంటి కొడుకే చేయాలి. మీరు మీ కుటుంబాలపై దృష్టి పెట్టండి. మీ పిల్లలు, అత్తమామలు.. వారినే చూసుకోండి.నా పెద్ద తప్పు ఏమిటంటే నా ముగ్గురు పిల్లలను,నా కుటుంబాన్ని పక్కన పెట్టి,నా భర్త,అత్తమామల అనుమతి లేకుండా కిడ్నీ ఇచ్చాను. నా తండ్రిని రక్షించాలనే ఆలోచనతో చేశాను.ఇప్పుడు నన్ను దూషణలతో అవమానిస్తున్నారు. నా తప్పు మీరు చేయకండి.రోహిణీ లాంటి కుమార్తె ఏ ఇంట్లో ఉండకపోవడమే మంచిది''అంటూ మరో పోస్ట్ చేశారు.
వివరాలు
రమీజ్ నీమత్ ఖాన్ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎంపీ రిజ్వాన్ జహీర్ అల్లుడు
ఆర్జేడీ ఎంపీ సంజయ్ యాదవ్, తేజస్వీకి అత్యంత సన్నిహితుడైన రమీజ్ ఖాన్ కారణంగానే ఆమె కుటుంబం నుంచి దూరమయ్యారు. రమీజ్ నీమత్ ఖాన్ ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎంపీ రిజ్వాన్ జహీర్ అల్లుడు. గతంలో ఆ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. తేజస్వీ క్రికెట్ రోజుల్లోనే ఆయనకు స్నేహితుడు. ప్రస్తుతం ఆయన తేజస్వీ రాజకీయ బృందంలో కీలక వ్యక్తిగా, అలాగే పార్టీ సోషల్ మీడియా కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారని తెలుస్తోంది.