LOADING...
Telangana: స్వీపర్ నెల జీతం 2 లక్షలు.. జిల్లా కలెక్టర్ జీతం కంటే ఎక్కువ:  తెలంగాణ ఖజానాకు 'శాలరీ' సెగ
తెలంగాణ ఖజానాకు 'శాలరీ' సెగ

Telangana: స్వీపర్ నెల జీతం 2 లక్షలు.. జిల్లా కలెక్టర్ జీతం కంటే ఎక్కువ:  తెలంగాణ ఖజానాకు 'శాలరీ' సెగ

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 26, 2026
03:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో నాలుగో తరగతి ఉద్యోగిగా పనిచేస్తున్న ఒక సీనియర్ స్వీపర్‌కు నెలకు దాదాపు రూ.2 లక్షల వరకు జీతం అందుతుందనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది విన్నవారికి ఆశ్చర్యంగా అనిపించినా...ఇది నిజమేనని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ రామకృష్ణారావు స్వయంగా వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం,తెలంగాణ విద్యుత్ శాఖలో పని చేస్తున్న సీనియర్ స్వీపర్‌కు రూ.2లక్షల వరకు వేతనం అందుతోంది. ఇదే సమయంలో పదేళ్ల సేవ పూర్తి చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారుల జీతం సుమారు రూ.1.5లక్షల వరకు ఉండగా,ఈ స్వీపర్ జీతం జిల్లా కలెక్టర్ వేతనాన్ని మించి ఉండటం విశేషంగా మారింది. వరుస పీఆర్సీ సవరణల కారణంగానే విద్యుత్ శాఖలో వేతనాలు ఈ స్థాయికి చేరాయని సీఎస్ వివరించారు.

వివరాలు 

జీతాలు,పెన్షన్ల కోసం ప్రతి నెలా సుమారు రూ.6 వేల కోట్లు

బుధవారం (ఫిబ్రవరి 25)జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడిన ఆయన,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు,పెన్షన్ల కోసం ప్రతి నెలా సుమారు రూ.6 వేల కోట్లు వెచ్చిస్తున్నామని తెలిపారు. 2014లో ఈ వ్యయం కేవలం రూ.1500 కోట్లే ఉండగా,ప్రస్తుతం అది నాలుగు రెట్లు పెరిగి రూ.6 వేల కోట్లకు చేరిందని చెప్పారు. ఇక విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న చీఫ్ ఇంజనీర్లు నెలకు రూ.7లక్షల వరకు వేతనం పొందుతున్నారని కూడా వెల్లడించారు. ఈ మొత్తం ఐఏఎస్ అధికారులు,రాష్ట్ర గవర్నర్ వేతనాన్ని కూడా మించిపోతుందని పేర్కొన్నారు. ప్రతి నాలుగేళ్లకోసారి జరిగే వేతన సవరణల ప్రభావంతో విద్యుత్ శాఖలో జీతాలు భారీగా పెరిగాయని అధికారులు చెబుతున్నారు.

వివరాలు 

సీనియర్ క్లాస్-4 ఉద్యోగులకు నెలకు దాదాపు రూ.2 లక్షల వరకు వేతనం

30 ఏళ్ల సేవ పూర్తి చేసిన సీనియర్ క్లాస్-4 ఉద్యోగులకు నెలకు దాదాపు రూ.2 లక్షల వరకు వేతనం చెల్లించాల్సి వస్తోందని తెలిపారు. మరోవైపు, మున్సిపాలిటీల్లో కొత్తగా చేరిన ఉద్యోగులకు సుమారు రూ.28 వేల జీతం అందుతుండగా, 30 ఏళ్ల అనుభవం ఉన్న డ్రైవర్లు,పారిశుద్ధ్య కార్మికులు నెలకు రూ.లక్షకు పైగా వేతనం పొందుతున్నారని సమాచారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి పదేళ్లలో మొత్తం రూ.15 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించగా, అందులో దాదాపు రూ.12 లక్షల కోట్లు కేవలం జీతాలు, పెన్షన్లు, అప్పుల చెల్లింపులకే వినియోగించబడినట్లు తెలిపారు.

Advertisement

వివరాలు 

విద్యుత్ రంగంలో చేపట్టిన సంస్కరణలే ప్రధాన కారణం

ఇక స్వీపర్ జీతం విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ స్థాయి వేతనాలు అన్ని శాఖల స్వీపర్లకు వర్తించవని స్పష్టమవుతోంది. ముఖ్యంగా విద్యుత్ శాఖ ఉద్యోగులకు మాత్రమే ఈ భారీ జీతాలు అందుతున్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం విద్యుత్ రంగంలో చేపట్టిన సంస్కరణలేనని చెప్పబడుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో విద్యుత్ శాఖను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డుగా నిర్వహించేవారు. అనంతరం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో విద్యుత్ రంగంలో కీలక మార్పులు చేపట్టడంతో,బోర్డు స్థానంలో పలు కంపెనీలు ఏర్పడ్డాయి. విద్యుత్ ఉత్పత్తి కోసం జెన్‌కో,సరఫరా కోసం ట్రాన్స్‌కోలు ఏర్పాటు చేయగా, ట్రాన్స్‌కోను ప్రాంతాల వారీగా విభజించి APEPDCL, APSPDCL, APCPDCL వంటి డిస్కమ్ సంస్థలను ఏర్పాటు చేశారు.

Advertisement

వివరాలు 

30 ఏళ్ల సేవ పూర్తి చేసిన వారికి ఈ స్థాయి వేతనం

ఈ మార్పుల సమయంలో విద్యుత్ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొనగా, వారికి భరోసా కల్పించేందుకు ప్రభుత్వం వేతనాలను గణనీయంగా పెంచింది. ఇన్‌క్రిమెంట్లు కూడా అదే స్థాయిలో నిర్ణయించడంతో, ఇతర శాఖలతో పోలిస్తే విద్యుత్ శాఖ ఉద్యోగులకు ఎక్కువ జీతాలు లభిస్తున్నాయి. దీర్ఘకాలం సేవ చేసిన సీనియర్ స్వీపర్ల వేతనం లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకు చేరినట్లు తెలుస్తోంది. సీఎస్ పేర్కొన్న స్వీపర్ జీతం కూడా ఇదే కేటగిరీలోకి వస్తుందని సమాచారం. దాదాపు 30 ఏళ్ల సేవ పూర్తి చేసిన వారికి ఈ స్థాయి వేతనం అందుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా, స్వీపర్ జీతం అంశం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Advertisement