LOADING...
Andhra: దేవుడి హుండీలో రూ.20 నోటుపై వింత వినతి.. ఏం రాశారో తెలిస్తే అవాక్కే..
దేవుడి హుండీలో రూ.20 నోటుపై వింత వినతి.. ఏం రాశారో తెలిస్తే అవాక్కే..

Andhra: దేవుడి హుండీలో రూ.20 నోటుపై వింత వినతి.. ఏం రాశారో తెలిస్తే అవాక్కే..

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 20, 2026
12:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

అనంతపురం జిల్లాలోని పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు సందర్భంగా బయటపడిన ఓ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. భక్తులు తమ కోరికలు నెరవేరాలని దేవుడికి కానుకలు సమర్పించడం, తమ కష్టాలను కాగితాలపై రాసి హుండీలో వేయడం సాధారణమే. అయితే ఈసారి హుండీలో కనిపించిన ఓ రూ.20 నోటుపై రాసిన సందేశం ఆలయ సిబ్బందితో పాటు భక్తులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. రూ.20 నోటుపై ఏమి రాసి ఉంది? హుండీ లెక్కింపు సమయంలో సిబ్బందికి ఓ రూ.20నోటు కనిపించింది.దానిపై,"స్వామీ.. మా అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నాను.ఆమె త్వరగా చనిపోయేలా చూడు"అని రాసి ఉండటంతో అక్కడున్నవారు ఒక్కసారిగా విస్మయానికి గురయ్యారు. సాధారణంగా భక్తులు ఆరోగ్యం, ఉద్యోగం,విద్య,వివాహం,సంతానం,ఆర్థిక సమస్యలు వంటి అంశాల్లో దేవుడి ఆశీర్వాదం కోరుతుంటారు.

వివరాలు 

సోషల్ మీడియాలో వైరల్

కానీ ఒకరి మరణాన్ని కోరుతూ హుండీలో వినతి సమర్పించడం అరుదైన ఘటనగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ విభేదాలు ఎంత తీవ్రమైన స్థాయికి చేరితే ఇలాంటి కోరికను దేవుడి ముందు ఉంచుతారో అర్థమవుతోందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. సమస్యలకు పరిష్కారం వెతకడం బదులు ఒకరి మరణాన్ని కోరుకోవడం సరికాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, ఆ మహిళ ఎలాంటి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుందో తెలియదని, ఆమె ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా విస్మరించరాదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

వివరాలు 

సోషల్ మీడియాలో సరదా కామెంట్లు..  

ఈ ఘటనపై సోషల్ మీడియాలో సరదా వ్యాఖ్యలు కూడా వెల్లువెత్తుతున్నాయి. "రూ.20 నోటుతో అత్తపై ఫిర్యాదు పెట్టేసింది", "ఇరవై రూపాయలకే అత్తను లేపేయమని కోరింది", "ఇలాంటి కోరికను దేవుడు కూడా ఊహించి ఉండడు" అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ సంఘటన హాస్యాస్పదంగా కనిపించినప్పటికీ, కుటుంబాల్లో పెరుగుతున్న విభేదాలు, వేధింపులు, మానసిక ఒత్తిడులు ఎంతటి తీవ్ర స్థాయికి చేరుతున్నాయో ప్రతిబింబించే ఉదాహరణగా పలువురు అభిప్రాయపడుతున్నారు.

Advertisement