NEET-UG: నీట్ ప్రశ్నాపత్రం ఉందంటూ రూ.30 వేలు డిమాండ్.. రంగంలోకి దిగిన పోలీసులు
ఈ వార్తాకథనం ఏంటి
వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించే నీట్ (NEET-UG) రీ-ఎగ్జామ్ సందర్భంగా మరోసారి ప్రశ్నాపత్రం లీక్ అనుమానాలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌లోని అజ్మీర్ పోలీసులు పేపర్ లీక్, మోసాలకు సంబంధించిన ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించారు. లక్షలాది మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్న వేళ ఈ ఘటన వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ కేసులో కీలకంగా మారిన అంశం ఒక వీడియో కాల్. ఆ కాల్‌లో గుర్తుతెలియని వ్యక్తి తన వద్ద నీట్ ప్రశ్నాపత్రం ఉందని చెబుతూ, దానిని చూపించేందుకు రూ.30 వేల చెల్లించాలని డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
వివరాలు
విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు
అజ్మీర్‌లోని డీఏవీ కళాశాల విద్యార్థి సంఘ అధ్యక్షుడు కృష్ణ సింగ్ ఠాకూర్ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీడియో కాల్ ద్వారా ప్రశ్నాపత్రం చూపించి విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఒక ఫ్రెషర్ విద్యార్థిని ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకురావడంతో, ఆమె చెప్పిన వివరాలను ధృవీకరించేందుకు తానే స్వయంగా ఆ నంబర్‌కు ఫోన్ చేసినట్లు కృష్ణ సింగ్ తెలిపారు. ''రేపు నీట్ పరీక్ష ఉండగా విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తూ డబ్బులు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. నాకు కూడా వీడియో కాల్‌లో ఒక ప్రశ్నాపత్రాన్ని చూపించి రూ.30 వేల చెల్లించాలని కోరారు. దీనికి సంబంధించిన రికార్డింగ్‌ను పోలీసులకు అందజేశానని చెప్పారు.
వివరాలు
క్యూఆర్ కోడ్ ను పంపినట్లు సమాచారం
అంతేకాకుండా, డబ్బు పంపేందుకు క్యూఆర్ కోడ్‌ను కూడా తనకు పంపినట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే పలువురు విద్యార్థులు ఈ మోసగాళ్ల బారిన పడినట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు. ఇలాంటి మోసాలను నమ్మకుండా విద్యార్థులు పరీక్షలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ ఘటనపై అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ఏఎస్పీ) హిమాన్షు జంగిడ్‌ను కలిసి పూర్తి వివరాలు తెలియజేసినట్లు కృష్ణ సింగ్ చెప్పారు. సంబంధిత మొబైల్ నంబర్, క్యూఆర్ కోడ్, వీడియో రికార్డింగ్ సహా అన్ని డిజిటల్ ఆధారాలను పోలీసులకు అందజేశామని తెలిపారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. వీడియో కాల్ చేసిన వ్యక్తి ఉపయోగించిన మొబైల్ నంబర్ ఎక్కడి నుంచి పనిచేస్తోంది,
వివరాలు
సమగ్రంగా దర్యాప్తు
క్యూఆర్ కోడ్‌కు అనుసంధానమైన బ్యాంక్ ఖాతా ఎవరిది అనే విషయాలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే వీడియో కాల్‌లో చూపించిన ప్రశ్నాపత్రం నిజంగా నీట్ ప్రశ్నాపత్రమేనా అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది. అజ్మీర్ ఎస్పీ ఉషా యాదవ్ మాట్లాడుతూ, పరీక్షల సమయంలో సైబర్ మోసగాళ్లు చురుకుగా మారి అభ్యర్థులను లక్ష్యంగా చేసుకుంటారని హెచ్చరించారు. 'వీడియో కాల్ ద్వారా ప్రశ్నాపత్రాలు విక్రయిస్తున్నారనే విషయం మా దృష్టికి వచ్చింది. దీనిపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది. ఇది పెద్ద ఎత్తున సాగుతున్న ప్రశ్నాపత్రం లీక్ రాకెట్‌లో భాగమా? లేక విద్యార్థులను మోసం చేసేందుకు రూపొందించిన కొత్త తరహా సైబర్ మోసమా? అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.
వివరాలు
22 లక్షల మందికి పైగా అభ్యర్థులు రీ-ఎగ్జామ్‌కు హాజరు
ఇదిలా ఉండగా, మే 3న నిర్వహించిన నీట్-యూజీ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో రద్దు కావడంతో, తాజాగా 22 లక్షల మందికి పైగా అభ్యర్థులు రీ-ఎగ్జామ్‌కు హాజరవుతున్నారు. గత పరీక్షలో చోటుచేసుకున్న వివాదాల కారణంగా దెబ్బతిన్న విశ్వసనీయతను తిరిగి పొందేందుకు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) ఈసారి అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. భద్రతా చర్యల్లో భాగంగా ప్రశ్నాపత్రాలను ఈసారి భారత వైమానిక దళం ద్వారా ప్రత్యేకంగా తరలించారు. దేశవ్యాప్తంగా విద్యా మంత్రిత్వశాఖ సీనియర్ అధికారులు పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టారు. మొత్తం 551 భారతీయ నగరాల్లోని 5,440 పరీక్షా కేంద్రాల్లో 95 వేల పరీక్షా గదుల్లో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. విదేశాల్లోని 14 కేంద్రాల్లో కూడా పరీక్ష జరుగుతోంది.