Loading...
Chandrachud: ఉక్రెయిన్‌తో వివాదం.. రష్యా తరఫున ఆర్బిట్రేటర్‌గా చంద్రచూడ్

Chandrachud: ఉక్రెయిన్‌తో వివాదం.. రష్యా తరఫున ఆర్బిట్రేటర్‌గా చంద్రచూడ్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 12, 2026
02:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ ప్రభుత్వ రంగ బ్యాంకు 'ఓస్చాడ్‌బ్యాంక్'తో కొనసాగుతున్న పెట్టుబడుల వివాదంలో రష్యా తన తరఫు ఆర్బిట్రేటర్‌గా భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డివై చంద్రచూడ్ ను నియమించింది. 1998లో రష్యా, ఉక్రెయిన్ మధ్య కుదిరిన ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం (BIT) పరిధిలో ఈ కేసు విచారణ జరుగుతోంది. డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, జపోరిఝియా ప్రాంతాల్లో రష్యా సైనిక చర్యల వల్ల తమ ఆస్తులు, కార్యకలాపాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఓస్చాడ్‌బ్యాంక్ ఆరోపిస్తోంది. ముఖ్యంగా 2022 తర్వాత జరిగిన పరిణామాల కారణంగా వందల మిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లిందని పేర్కొంటూ పరిహారం కోరుతోంది.

వివరాలు 

రష్యా తన ప్రతినిధిగా చంద్రచూడ్‌ను ఎంపిక చేసింది

వివాదాన్ని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టిన ఓస్చాడ్‌బ్యాంక్.. 2025 జులైలో రష్యాకు నోటీసులు పంపింది.

వివాద పరిష్కారానికి చర్చలు జరపాలని కోరినప్పటికీ రష్యా నుంచి స్పందన రాలేదని బ్యాంకు పేర్కొంది.

దీంతో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది.

ఈ కేసు ప్రస్తుతం త్రిసభ్య ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ ముందుకు వెళ్లింది.

త్రిసభ్య ధర్మాసనానికి ఇరు పక్షాల అంగీకారంతో కోస్టారికాకు చెందిన డయాలా జిమెనెజ్ అధ్యక్షత వహిస్తున్నారు.

ఉక్రెయిన్ ప్రభుత్వ రంగ బ్యాంకు ఓస్చాడ్‌బ్యాంక్ తరఫున గ్రీకు ఆర్బిట్రేటర్ స్టవ్రోస్ బ్రెకౌలాకిస్‌ను నియమించారు.

తాజాగా రష్యా తన ప్రతినిధిగా జస్టిస్ డి.వై. చంద్రచూడ్‌ను ఎంపిక చేసింది.

వివరాలు 

గతంలో రష్యా విజ్ఞప్తులను తిరస్కరించిన చంద్రచూడ్.. ఈసారి అంగీకారం

ఇదే సమయంలో గతంలో ఇలాంటి ఇతర వివాదాలకు సంబంధించి రష్యా చేసిన ఆర్బిట్రేటర్ నియామక విజ్ఞప్తులను జస్టిస్ చంద్రచూడ్ తిరస్కరించిన విషయం గమనార్హం.

అయితే ఈసారి రష్యా తరఫున ఆర్బిట్రేటర్‌గా వ్యవహరించేందుకు ఆయన అంగీకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఆర్బిట్రేషన్‌లో నిష్పాక్షికత, స్వతంత్రత, సమాన అవకాశాలకు ప్రాధాన్యం ఉంటుందని మాజీ సీజేఐగా చంద్రచూడ్ గతంలోనూ పేర్కొన్నారు.

అంతర్జాతీయ వాణిజ్య వివాదాల పరిష్కారంలో ఆర్బిట్రేషన్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ADVERTISEMENT