
Sabarimala Ayyappa Temple: నేడు శబరిమల అయ్యప్ప ఆలయం మూసివేత.. మళ్లీ ఎప్పుడు తెరుస్తారంటే!
ఈ వార్తాకథనం ఏంటి
Sabarimala Ayyappa Temple: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శబరిమల అయ్యప్ప దేవాలయానికి భక్తులు పోటెత్తుతున్నారు.
ఆలయం తెరిచిన 5 వారాల్లోనే దేవస్థానానికి ఏకంగా రూ.200 కోట్ల ఆదాయం వచ్చిందంటే.. భక్తులు ఏ స్థాయిలో వచ్చారో అర్థం చేసుకోవచ్చు.
ఈ క్రమంలో బుధవారం రాత్రి 11గంటలకు మూసివేస్తున్నట్లు ట్రావెన్‌కోర్ బోర్డ్ అధికారులు ప్రకటించారు.
బుధవారంతో 41రోజుల మండల పూజ ముగుస్తుందని, అందుకే ఆలయాన్ని మూసివేస్తున్నట్లు వెల్లడించారు.
ఆలయాన్ని మళ్లీ 'మకరవిళక్కు' పూజల కోసం ఈ నెల 30వ తేదీన.. సాయంత్రం 5గంటలకు తెరవనున్నారు.
జనవరి 15న సాయంత్రం 6 గంటల 36 నిమిషాల 45 సెకన్లకు జ్యోతి దర్శనం ఉంటుందని ట్రావెన్‌కోర్ బోర్డ్ పేర్కొంది.
శబరిమల
39రోజుల్లో శబరిమలను దర్శించుకున్న 31,43,163 మంది భక్తులు
జ్యోతి దర్శనం తర్వాత శబరిమల ఆలయాన్ని జనవరి 20వ తేదీన మూసివేయనున్నారు.
అనంతరం అయ్యప్ప దర్శనానికి భక్తులను అనుమతించరు. దీంతో ఈ ఏడాదికి శబరిమల యాత్రా సీజన్ ముగిసినట్లు భావించాలి.
ఇదిలా ఉంటే, మండల పూజ ముగింపు ఉత్సవాన్ని భారీగా నిర్వహించేందుకు దేవస్థానం బోర్డు భారీ ఏర్పాట్లు చేసింది.
ఈ సీజన్‌లో శబరిమలకు భక్తులు రికార్డు స్థాయిలో వచ్చారు.
ఆలయం తెరిచిన కేవలం 39రోజుల్లో దేవస్థానానికి రూ.204.30 కోట్ల ఆదాయం వచ్చింది. 31,43,163 మంది భక్తులు దర్శించుకున్నారు.
ఇందులో నాణేల ద్వారా రూ.63.89కోట్లు.. ప్రసాదం విక్రయంతో వల్ల రూ.96.32కోట్లు.. అప్పం ప్రసాదం అమ్మడం ద్వారా రూ.12.38కోట్ల ఆదాయం వచ్చింది.
ఇక 41 రోజుల ఆదాయం లెక్కిస్తే.. ఆదాయం భారీగా పెరిగే అవకాశం ఉంది.