Loading...
Sadhguru: నేపాల్‌ వరదల్లో 80 మంది ఈశా యాత్రికులు గల్లంతు.. సద్గురు తీవ్ర ఆవేదన
నేపాల్‌ వరదల్లో 80 మంది ఈశా యాత్రికులు గల్లంతు.. సద్గురు తీవ్ర ఆవేదన

Sadhguru: నేపాల్‌ వరదల్లో 80 మంది ఈశా యాత్రికులు గల్లంతు.. సద్గురు తీవ్ర ఆవేదన

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 27, 2026
04:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేపాల్‌-టిబెట్‌ సరిహద్దులో భారీ వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. కైలాస యాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న ఈశా ఫౌండేషన్‌కు చెందిన 80 మంది యాత్రికులు గల్లంతయ్యారు. వారి ఆచూకీ తెలియకపోవడంతో టిబెట్‌లోని ఈశా శిబిరంలో ఆందోళన నెలకొంది. ఈ ఘటనపై సద్గురు జగదీశ్‌ వాసుదేవ్‌ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. గల్లంతైన యాత్రికుల కోసం సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సద్గురు స్వయంగా వరద ప్రభావిత ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడికి వెళ్లే మార్గాలు వరదల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో భారత్‌, చైనా, అమెరికా దౌత్య కార్యాలయాల ద్వారా అక్కడికి వెళ్లేందుకు అనుమతి పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. యాత్రికుల కోసం గాలింపు చర్యల్లో పాల్గొనాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.

వివరాలు 

గైరోంగ్‌ ఇమ్మిగ్రేషన్‌ కేంద్రం వద్దే..

కైలాస యాత్ర ముగించుకుని తిరిగి వస్తున్న 80 మంది సభ్యుల బృందం గైరోంగ్‌ ఇమ్మిగ్రేషన్‌ కేంద్రానికి చేరుకుంది.

బృంద నాయకుడు 'ఈశాంగ' ప్రవీణ్‌ ఉదయం 9.05 గంటలకు ఈశా ఫౌండేషన్‌కు సమాచారం పంపించారు.

అయితే ఆ సందేశం పంపిన కేవలం తొమ్మిది నిమిషాల్లోనే అక్కడ భారీ వరద ముంచెత్తింది.

ఉదయం 9.14 గంటలకు ఇమ్మిగ్రేషన్‌ కేంద్రం పూర్తిగా వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఈ ఘటనపై సద్గురు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

''వారం క్రితమే నేను ఆ భవనంలో ఉన్నాను. ఇప్పుడు అది పూర్తిగా కొట్టుకుపోయింది'' అని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. బృంద నాయకుడు ప్రవీణ్‌ గత రెండు దశాబ్దాలకు పైగా ఈశా ఫౌండేషన్‌తో కలిసి పనిచేస్తున్నారని తెలిపారు.

వివరాలు 

12 గంటలుగా సమాచారం లేదు..

గల్లంతైన బృందం నుంచి దాదాపు 12 గంటలుగా ఎలాంటి సమాచారం అందలేదని సద్గురు వెల్లడించారు.

బృంద నాయకుడు ప్రవీణ్‌ ఉపయోగిస్తున్న నేపాల్‌ ఫోన్‌ నంబర్‌ కూడా ప్రస్తుతం పనిచేయడం లేదని తెలిపారు.

దీంతో 80 మంది యాత్రికులు ఇమ్మిగ్రేషన్‌ కేంద్రంలో ఉన్న సమయంలోనే భారీ వరద అక్కడికి చేరుకుని ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

భారీగా ప్రాణ నష్టం..

నేపాల్‌ సరిహద్దు ప్రాంతాల్లో వరదల కారణంగా భారీగా ప్రాణ నష్టం సంభవించినట్లు సమాచారం. ఇప్పటివరకు దాదాపు 300 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది.

మరో 1,500 మంది వరకు ఆచూకీ తెలియడం లేదని సమాచారం. గల్లంతైన వారిలో సుమారు 300 మంది భారతీయులు ఉన్నట్లు నేపాల్‌ విదేశాంగ మంత్రి వెల్లడించారు.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నేపాల్‌ వరదలపై సద్గురు భావోద్వేగం

ADVERTISEMENT