LOADING...
Andhra Pradesh: సాయికృష్ణ కేసులో సంచలన ట్విస్ట్.. మరణాన్ని ధృవీకరించిన సిట్, రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు
సాయికృష్ణ కేసులో సంచలనం.. మరణాన్ని ధృవీకరించిన సిట్

Andhra Pradesh: సాయికృష్ణ కేసులో సంచలన ట్విస్ట్.. మరణాన్ని ధృవీకరించిన సిట్, రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 24, 2026
01:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసుకు సంబంధించి సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం)సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో పలు సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. సాయికృష్ణ మరణంపై నెలకొన్న అనుమానాలకు తెరదించుతూ,ఆయన కస్టడీలో గాయాలపాలై మరణించినట్లు అందుబాటులో ఉన్న ఆధారాలు సూచిస్తున్నాయని సిట్ పేర్కొంది. రిమాండ్ రిపోర్ట్ ప్రకారం,సాయికృష్ణ లాకప్ డెత్‌కు గురైనట్లు దర్యాప్తులో తేలిందని అధికారులు వెల్లడించారు. మృతదేహాన్ని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో చూసినట్లు ఓ ఎస్సై తన వాంగ్మూలంలో తెలిపినట్లు సిట్ పేర్కొంది. అలాగే సాక్ష్యాలను నాశనం చేయడం, సాయికృష్ణను అధికారిక పోలీసు కస్టడీలో ఉన్నట్లు నమోదు కాకుండా చూడడం వంటి చర్యలకు అప్పటి సీఐ నాగరాజే కారణమని రిపోర్ట్‌లో ప్రస్తావించింది.

వివరాలు 

సాయికృష్ణ తల్లిని దూషించిన సీఐ నాగరాజు

అంతేకాకుండా, పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ డేటాను డీవీఆర్ నుంచి తొలగించినట్లు కూడా సిట్ తన నివేదికలో పేర్కొంది. ఈ చర్యలు కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను చెరిపివేయాలనే ఉద్దేశంతో జరిగినట్లు అనుమానాలు వ్యక్తం చేసింది. సాయికృష్ణ మరణించిన విషయం తెలిసినప్పటికీ, కృష్ణలంక పోలీస్ సిబ్బంది ఆ సమాచారాన్ని సంబంధిత మెజిస్ట్రేట్‌కు తెలియజేయలేదని సిట్ వెల్లడించింది. తన కుమారుడి ఆచూకీ కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన సాయికృష్ణ తల్లిని సీఐ నాగరాజు దూషించినట్లు కూడా రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది. సాయికృష్ణ కోసం ఆయన తల్లి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన సందర్భంలో కూడా వాస్తవాలను కోర్టుకు వెల్లడించలేదని సిట్ ఆరోపించింది.

వివరాలు 

కేసులో కీలక ఆధారాలను పూర్తిగా ధ్వంసం

హైకోర్టు ఎదుట నిజాలను దాచిపెట్టి,కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరిగిందని స్పష్టం చేసింది. దర్యాప్తులో లభించిన పరిస్థితులు,సాక్ష్యాల ధ్వంసం,శాస్త్రీయ ఆధారాల తొలగింపు వంటి అంశాలను పరిశీలించిన తర్వాత సాయికృష్ణ మరణించాడనే నిర్ధారణకు వచ్చినట్లు సిట్ తెలిపింది. ఈ కేసులో కీలక ఆధారాలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు గుర్తించామని పేర్కొంది. అలాగే, కేసుకు సంబంధించిన అన్ని వాస్తవాలను వెలికితీయాలంటే ప్రధాన నిందితుడిగా పేర్కొన్న నాగరాజును మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని సిట్ అధికారులు వెల్లడించారు. 2026 జూన్ 2కు ముందే సాయికృష్ణ మరణించి ఉండవచ్చని తమకు బలమైన నమ్మకం ఉందని, పోలీసు కస్టడీలో ఉండగానే గాయాల కారణంగా ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు అందుబాటులో ఉన్న ఆధారాలు స్పష్టంగా సూచిస్తున్నాయని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.

Advertisement