Sankranthi: కోనసీమ గోదావరిలో సంక్రాంతి పండుగ సంబరం.. ప్రభుత్వ ఆధ్వర్యంలో వేడుకలు.. 3 రోజుల పాటు వివిధ పోటీల నిర్వహణ
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుపుకునే పండుగలలో ఒకటి అయిన సంక్రాంతి, ఈసారి కోనసీమకు ముందే వచ్చిందన్నట్లు గోదావరి తీరం పులకించింది. రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్న 'సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ' సంక్రాంతి ఉత్సవాలు ఆదివారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, ఆత్రేయపురంలో ప్రారంభమయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు విచ్చేయడంతో సందడి నెలకొంది. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో, జిల్లా కలెక్టర్ మహేష్‌కుమార్, ఎస్పీ రాహుల్ మీనా జ్యోతి వెలిగించి వేడుకలను ప్రారంభించారు.
వివారాలు
పర్యాటకంగా అభివృద్ధి.. యువతకు ఉపాధి అవకాశాలు
సత్యానందరావు మాట్లాడుతూ, వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయం ఈ ప్రాంతానికి ప్రత్యేక కీర్తిని తీసుకువచ్చిందని, కేరళ శైలిలో డ్రాగన్ పడవల పోటీలను నిర్వహించడం ద్వారా కోనసీమకు మరింత పేరు తెచ్చేలా కృషి చేస్తామని అన్నారు. జిల్లా కలెక్టర్ మహేష్‌కుమార్ మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలను సంవత్సరమంతా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే, ఈ ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. కోవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, రాష్ట్ర సృజనాత్మకత మరియు సాంస్కృతిక కమిషన్ ఛైర్‌పర్సన్ పొడపాటి తేజస్వి, తదితరులు కూడా ఉత్సవాల్లో పాల్గొన్నారు.
వివరాలు
ఆహ్లాదకరంగా రంగవల్లులు,ఈత పోటీలు
పోటీల్లో దాదాపు ఒక కిలోమీటర్ పొడవు రంగవల్లులు ఏర్పాటు చేశారు. విశాఖపట్నం, విజయవాడ, ఉభయగోదావరి జిల్లాల నుంచి సుమారు 350 మంది మహిళలు పోటీల్లో పాల్గొన్నారు. ఆత్రేయపురం వంతెన వద్ద నిర్వహించిన ఈత పోటీలలో 234 మంది పాల్గొని, చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు అన్ని వయస్సుల ప్రతిభ చూపించారు. లొల్లలాకుల వద్ద ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ కూడా హర్షం కూర్చింది. ఆత్రేయపురంలోని పూతరేకులు, బొబ్బట్లు, మిల్లెట్‌లతో తయారు చేసిన వంటకాలు, సూప్‌లు, బొమ్మల కొలువులు, చేనేత వస్త్రాల స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పోటీలకు వచ్చిన ప్రతి వ్యక్తికి భోజన సదుపాయం అందించబడింది.
వివరాలు
డ్రాగన్ పడవల పోటీలు ప్రారంభం
డ్రాగన్, కయాకింగ్, కనోయింగ్ పడవల పోటీలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యి రెండు రోజుల పాటు కొనసాగనుంది. పోటీలలో పాల్గొనడానికి పలు రాష్ట్రాల నుంచి సుమారు 250 మంది రాబోతున్నారు.