Loading...
PM Modi's Saptdhara Vision: భారత్‌ అభివృద్ధికి 'సప్తధార'.. మోదీ ప్రసంగంలో 7 కీలక అంశాలివే
భారత్‌ అభివృద్ధికి 'సప్తధార'.. మోదీ ప్రసంగంలో 7 కీలక అంశాలివే

PM Modi's Saptdhara Vision: భారత్‌ అభివృద్ధికి 'సప్తధార'.. మోదీ ప్రసంగంలో 7 కీలక అంశాలివే

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 15, 2026
09:45 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం దేశ భవిష్యత్తు ప్రగతికి సరికొత్త దిశానిర్దేశం చేసింది. 2047 నాటికి 'వికసిత్ భారత్‌'గా, సంపూర్ణ స్వయంసమృద్ధి సాధించిన దేశంగా భారత్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా.. దేశ అభివృద్ధికి చోదక శక్తులుగా నిలిచే ఏడు కీలక రంగాలను 'సప్తధార' పేరుతో ప్రధాని ఆవిష్కరించారు. రానున్న రోజుల్లో భారత ఆర్థిక, సామాజిక పురోగతికి ఈ ఏడు రంగాలు కీలకంగా మారనున్నాయని పేర్కొన్నారు.

వివరాలు

1. మాన్యుఫ్యాక్చరింగ్

'సప్తధార'లో తొలి ధారగా మాన్యుఫ్యాక్చరింగ్‌ను ప్రధాని గుర్తించారు. దేశ తదుపరి వృద్ధి దశకు తయారీ రంగం బలమైన పునాదిగా నిలవాలని అన్నారు.

కేవలం చిన్న విడిభాగాల తయారీకి పరిమితం కాకుండా సంపూర్ణ ఉత్పత్తుల తయారీపై భారత్‌ దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రపంచ సరఫరా వ్యవస్థల్లో భారత్‌ను కీలక భాగస్వామిగా నిలబెట్టేందుకు ధర, నాణ్యత, భారీ స్థాయి ఉత్పత్తి అనే మూడు అంశాలపై తయారీదారులు దృష్టి పెట్టాలని సూచించారు.

భారత ఉత్పత్తులకు ఆకర్షణీయమైన ప్యాకేజింగ్‌, అత్యుత్తమ నాణ్యత ప్రత్యేక గుర్తింపుగా మారాలని ఆకాంక్షించారు.

వివరాలు

2. వ్యవసాయం-ఆహార భద్రత

వ్యవసాయం, ఆహార భద్రతను రెండో ధారగా ప్రధాని పేర్కొన్నారు. దేశ అభివృద్ధిలో వ్యవసాయ రంగానికి ఎప్పటికీ కీలక స్థానం ఉంటుందని స్పష్టం చేశారు.

ఆర్థిక వృద్ధిలో ఆహార ఉత్పత్తి, వ్యవసాయం కేంద్రబిందువులుగా కొనసాగుతాయని అన్నారు.

దీర్ఘకాలిక ఆహార భద్రతను నిర్ధారించేందుకు వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ఉత్పాదకతను పెంచాల్సిన అవసరం ఉందని మోదీ చెప్పారు.

ADVERTISEMENT

వివరాలు

3. సాంకేతికత, ఆవిష్కరణలు

సాంకేతికత, ఆవిష్కరణలను మూడో ధారగా ప్రధాని అభివర్ణించారు. ప్రపంచం డేటా సెంటర్లు, రోబోటిక్స్‌, అత్యాధునిక సాంకేతికతల యుగంలోకి అడుగుపెడుతోందని తెలిపారు.

ఈ రంగాల్లో భారత్‌ ప్రపంచ స్థాయి హబ్‌గా ఎదగాలని ఆకాంక్షించారు. యూపీఐ విజయంతో భారత్‌ తన సాంకేతిక సామర్థ్యాన్ని ఇప్పటికే ప్రపంచానికి చాటిందని గుర్తుచేశారు.

ఇకపై మరింత పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు.

నెక్స్ట్‌ జనరేషన్‌ టెలికమ్యూనికేషన్‌ అభివృద్ధిని వేగవంతం చేసి, స్వదేశీ 6జీ సాంకేతికతను దేశంలోని ప్రతి ప్రాంతానికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

ADVERTISEMENT

వివరాలు

4. మౌలిక వసతులు

మౌలిక వసతులు, 'గతి శక్తి' ద్వారా మెరుగైన అనుసంధానాన్ని నాలుగో ధారగా మోదీ పేర్కొన్నారు.

వ్యాపార విస్తరణ, లాజిస్టిక్స్‌ మెరుగుదల, వాణిజ్య ప్రోత్సాహానికి రోడ్లు, హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేల అభివృద్ధి అత్యంత కీలకమని చెప్పారు.

మౌలిక వసతులకు నిరంతరం ప్రాధాన్యం ఇస్తామని, వేగవంతమైన కనెక్టివిటీ దేశంలో సరికొత్త ఆర్థిక అవకాశాలను తెరుస్తుందని ప్రధాని తెలిపారు.

వివరాలు

5. రక్షా శక్తి

'రక్షా శక్తి'ని ఐదో ధారగా మోదీ ఆవిష్కరించారు. రక్షణ రంగంలో విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, దేశీయ తయారీ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని చెప్పారు.

ముఖ్యంగా డ్రోన్లు, కౌంటర్‌ డ్రోన్‌ వ్యవస్థలు వంటి అత్యాధునిక సైనిక సాంకేతికతలపై పెట్టుబడులను పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

దేశ భద్రతను మరింత పటిష్ఠంగా ఉంచేందుకు ఆత్మనిర్భర్‌ రక్షణ రంగం అత్యవసరమని స్పష్టం చేశారు.

వివరాలు

6. గ్రీన్‌ ఎనర్జీ

హరిత ఇంధనాన్ని ఆరో ధారగా ప్రధాని గుర్తించారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే భవిష్యత్తులో పెరగనున్న ఇంధన అవసరాలను తీర్చేందుకు క్లీన్‌ ఎనర్జీ సాంకేతికతల్లో ఆవిష్కరణలు అత్యంత ముఖ్యమని అన్నారు.

పునరుత్పాదక ఇంధన రంగాన్ని విస్తరించడంతో పాటు స్వచ్ఛమైన ఇంధన వనరుల వైపు భారత్‌ వేగంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని మోదీ చెప్పారు.

వివరాలు

7. భారత్‌ సాఫ్ట్‌ పవర్

'సప్తధార'లో చివరి ధారగా భారతదేశ సాఫ్ట్‌ పవర్‌ను ప్రధాని ప్రస్తావించారు. భారత సాంస్కృతిక ప్రభావం దేశ సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోందని తెలిపారు.

యోగా, హస్తకళలు, సినిమాలు, యానిమేషన్‌, గేమింగ్‌, డిజిటల్‌ కంటెంట్‌, ఇతర సృజనాత్మక రంగాలు భారత సాఫ్ట్‌ పవర్‌కు ప్రధాన స్తంభాలని పేర్కొన్నారు.

పర్యాటక రంగంలో భారత్‌కు అపారమైన అవకాశాలు ఉన్నాయని, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు మరింత కృషి చేయాలని సూచించారు.

జాతీయ పార్కులు, సాంస్కృతిక విశేషాలు, వినోద పరిశ్రమ, వేగంగా విస్తరిస్తున్న 'కాన్సర్ట్‌ ఎకానమీ' వంటివి పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు భారత గొప్ప వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పేందుకు అద్భుతమైన వేదికలుగా నిలుస్తాయని మోదీ వివరించారు.

ADVERTISEMENT