Supreme Court: ఢిల్లీ అల్లర్ల కేసు.. ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌కు బెయిల్ నిరాకరణ
ఈ వార్తాకథనం ఏంటి
2020 ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వీరిద్దరికీ మధ్యంతర బెయిల్ మంజూరు చేసేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ కేసులో ఢిల్లీ పోలీసుల వాదనలు విన్న తర్వాతే బెయిల్‌పై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. 2020లో ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్ల వెనుక విస్తృత కుట్ర ఉందన్న ఆరోపణలతో ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌లపై కేసు నమోదైంది. ఈ కేసులో సుదీర్ఘకాలంగా జైలులో ఉంటున్నందున తమకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బుధవారం (నవంబర్ 25) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం వారి బెయిల్ పిటిషన్లపై విచారణ చేపట్టింది.
వివరాలు
సానుకూలంగా స్పందించని ధర్మాసనం
ఈ సందర్భంగా ఉమర్ ఖాలిద్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, షర్జీల్ ఇమామ్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు.
తమ క్లయింట్లు చాలా కాలంగా జైలులోనే ఉన్నారని, ఈ నేపథ్యంలో వారికి మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ధర్మాసనాన్ని కోరారు.
అయితే, వారి అభ్యర్థనపై ధర్మాసనం సానుకూలంగా స్పందించలేదు. "ఈరోజు మధ్యంతర బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదు. ముందుగా ఢిల్లీ పోలీసుల వాదనలు వినాలి" అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి, జస్టిస్ వి. మోహన్లతో కూడిన ధర్మాసనం తక్షణ ఉపశమనం కల్పించేందుకు నిరాకరించింది.
వివరాలు
త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని రిజిస్ట్రీకి ఆదేశం
మరోవైపు, ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై తమ సమాధానం తెలియజేయాలని ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
గతంలో తస్లీమ్ అహ్మద్ కేసులో ఇచ్చిన రిఫరెన్స్ ఉత్తర్వులను కూడా ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది.
ఈ నేపథ్యంలో ప్రస్తుత బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపేందుకు తగిన త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని రిజిస్ట్రీని ఆదేశించింది.
ఇందుకోసం సంబంధిత ఫైల్‌ను పరిపాలనాపరమైన నిర్ణయం తీసుకునేందుకు ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచాలని సూచించింది.