Loading...
ECI Tells Supreme Court: ఈవీఎంలకు టోటలైజర్‌ ఏర్పాటు సాధ్యం కాదు.. సుప్రీంకోర్టుకు ఈసీ కీలక అఫిడవిట్
ఈవీఎంలకు టోటలైజర్‌ ఏర్పాటు సాధ్యం కాదు.. సుప్రీంకోర్టుకు ఈసీ కీలక అఫిడవిట్

ECI Tells Supreme Court: ఈవీఎంలకు టోటలైజర్‌ ఏర్పాటు సాధ్యం కాదు.. సుప్రీంకోర్టుకు ఈసీ కీలక అఫిడవిట్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 02, 2026
08:19 am

ఈ వార్తాకథనం ఏంటి

సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గంలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో నమోదైన ఓట్లను కలిపి లెక్కించేలా ఈవీఎంలకు టోటలైజర్‌ యంత్రాలను అమర్చడం ప్రస్తుత చట్టాలు, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం సాధ్యం కాదని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో టోటలైజర్‌ వ్యవస్థపై తన అభిప్రాయాలను వెల్లడించింది. ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా ఓట్ల లెక్కింపు సురక్షితంగా జరిగిందన్న నమ్మకాన్ని ఓటర్లలో కల్పించేందుకు టోటలైజర్‌ వ్యవస్థను ప్రవేశపెట్టాలని కోరుతూ యోగేష్‌ గుప్తా 2014లో సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై 2018 జనవరి 12న అప్పటి ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

వివరాలు 

పార్టీలు, మంత్రుల బృందం వ్యతిరేకించాయి

తాజాగా టోటలైజర్‌ ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలు, ఎదురయ్యే ఇబ్బందులను వివరిస్తూ సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈసీ అఫిడవిట్‌ సమర్పించింది.

ఒక నియోజకవర్గంలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వినియోగించిన ఈవీఎంల కంట్రోల్‌ యూనిట్లను కేబుళ్ల ద్వారా ఒకేసారి అనుసంధానించి, వాటిలో నమోదైన ఓట్లను సమష్టిగా లెక్కించి ఫలితాలను వెల్లడించాలన్నది పిటిషనర్‌ ప్రతిపాదన అని ఈసీ పేర్కొంది.

అయితే ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలంటే 'ఎన్నికల నిర్వహణ నిబంధనలు-1961'లో మార్పులు చేయాల్సి ఉంటుందని తెలిపింది.

టోటలైజర్‌ అంశంపై 2008 నుంచే ఎన్నికల సంఘం, న్యాయశాఖ, పార్లమెంటరీ కమిటీ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగుతున్నాయని ఈసీ వివరించింది.

వివరాలు 

పార్టీలు, మంత్రుల బృందం వ్యతిరేకించాయి

ఇదే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ కూడా దాఖలైందని పేర్కొంది.

2016లో టోటలైజర్‌ ప్రతిపాదనను 21 రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయని తెలిపింది.

కేంద్ర మంత్రుల బృందం సైతం ఈ ప్రతిపాదనకు అనుకూలంగా లేదని వెల్లడించింది.

బూత్‌లవారీగా ఓటింగ్‌ సరళి వెల్లడైతేనే రాజకీయ పార్టీలు తమ పనితీరును సమీక్షించుకుని అవసరమైన మార్పులు చేసుకునే అవకాశం ఉంటుందని మంత్రుల బృందం అభిప్రాయపడినట్లు ఈసీ తెలిపింది.

2018లో ఈ పిటిషన్‌ విచారణకు వచ్చిన సమయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని ప్రత్యేక వర్కింగ్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేశామని పేర్కొంది.

టోటలైజర్‌ వ్యవస్థను ప్రవేశపెట్టే అవకాశాలు, సాధ్యాసాధ్యాలపై ఆ బృందం సమగ్రంగా అధ్యయనం చేసిందని వివరించింది.

ADVERTISEMENT

వివరాలు 

చంద్రబాబు కేసులో ఇచ్చిన ఉత్తర్వులకూ విరుద్ధం

అయితే టోటలైజర్‌ను అమలు చేయాలంటే ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా సవరించాల్సి ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది.

ప్రస్తుతం అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలోనే ఓట్ల లెక్కింపు జరుగుతోందని ఈసీ తెలిపింది.

లెక్కించిన ఓట్లను పోలింగ్‌ ముగిసే సమయంలో నమోదు చేసే ఫాం-17సీలోని వివరాలతో సరిపోల్చుకునే అవకాశం ఉందని పేర్కొంది.

అదేవిధంగా నిర్దిష్ట పోలింగ్‌ కేంద్రానికి సంబంధించిన వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలని అభ్యర్థులు కోరవచ్చని తెలిపింది.

అవసరమైతే మొత్తం ఓట్లను లేదా కొంత మేర ఓట్లను తిరిగి లెక్కించాలని కోరే హక్కు కూడా అభ్యర్థులకు ఉందని వివరించింది.

ADVERTISEMENT

వివరాలు 

చంద్రబాబు కేసులో ఇచ్చిన ఉత్తర్వులకూ విరుద్ధం

అయితే అన్ని పోలింగ్‌ కేంద్రాల ఓట్లను ఒకేసారి కలిపి లెక్కించే టోటలైజర్‌ విధానం అమల్లోకి వస్తే లెక్కింపు ప్రక్రియలో పారదర్శకత తగ్గే అవకాశం ఉందని ఈసీ అభిప్రాయపడింది.

పోలైన ఓట్లు, వెల్లడైన ఫలితాలను ఫాం-17సీ ద్వారా పోల్చి చూసే ప్రస్తుత విధానానికి కూడా ఇబ్బంది ఏర్పడుతుందని పేర్కొంది.

ఇది ఎన్నికలకు సంబంధించిన వివాదాల పరిష్కారంపైనా ప్రభావం చూపుతుందని ఈసీ తెలిపింది.

ఎన్నికల ఫలితాలపై న్యాయపరమైన పరిష్కారం కోరే అవకాశాలు కూడా పరిమితమవుతాయని పేర్కొంది.

వివరాలు 

చంద్రబాబు కేసులో ఇచ్చిన ఉత్తర్వులకూ విరుద్ధం

2019లో ఎన్‌.చంద్రబాబునాయుడు వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు కూడా టోటలైజర్‌ విధానం విరుద్ధంగా ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో యాదృచ్ఛికంగా ఎంపిక చేసిన ఐదు వీవీప్యాట్‌ యంత్రాల స్లిప్పులను తప్పనిసరిగా లెక్కించాలని ఆ కేసులో కోర్టు ఆదేశించిన విషయాన్ని గుర్తుచేసింది.

ఆ తర్వాత ఏడీఆర్‌ వర్సెస్‌ ఈసీఐ కేసులో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 5 శాతం వీవీప్యాట్‌ స్లిప్పులను ఈవీఎంలలో నమోదైన ఓట్లతో సరిపోల్చి చూడాలని సుప్రీంకోర్టు నిర్దేశించిందని తెలిపింది.

ఈ ప్రక్రియ చేపట్టాలంటే ఓట్ల లెక్కింపు పోలింగ్‌ కేంద్రాల వారీగా జరగాల్సిందేనని పేర్కొంది.

టోటలైజర్‌ విధానంలో ఈ విధమైన పోలిక సాధ్యం కాదని స్పష్టం చేసింది.

వివరాలు 

మరిన్ని ఆరోపణలకు తావిచ్చినట్లు అవుతుంది

ఈ రెండు తీర్పులే టోటలైజర్‌ వ్యవస్థను ప్రవేశపెట్టడానికి ప్రధాన అడ్డంకులుగా ఉన్నాయని ఈసీ వివరించింది.

ఈవీఎంల పనితీరుపై తరచూ అనుమానాలు, ఆరోపణలు వ్యక్తమవుతున్నాయని ఈసీ పేర్కొంది.

ఈవీఎంల పనితీరును సుప్రీంకోర్టు సమగ్రంగా పరిశీలించి, వాటిలో మోసానికి అవకాశం లేదని స్పష్టం చేసినప్పటికీ ప్రశ్నలు కొనసాగుతూనే ఉన్నాయని తెలిపింది.

ఇలాంటి పరిస్థితుల్లో చట్టపరంగా అనుమతి లేని టోటలైజర్‌ వంటి వ్యవస్థను ప్రవేశపెడితే కొత్త ఆరోపణలు, వివాదాలకు అవకాశం కల్పించినట్లవుతుందని ఈసీ అభిప్రాయపడింది.

ఇప్పటికే సున్నితంగా ఉన్న ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు ఉన్న విశ్వాసం మరింత సంక్లిష్టమయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది.

వివరాలు 

మరిన్ని ఆరోపణలకు తావిచ్చినట్లు అవుతుంది

ప్రజాస్వామ్య వ్యవస్థ సజావుగా కొనసాగేందుకు ప్రజల నమ్మకం అత్యంత కీలకమని ఈసీ తెలిపింది.

ఎన్నికల ప్రక్రియపై అనుమానాలను తొలగించి విశ్వాసాన్ని పెంచేందుకు కఠినమైన,పారదర్శకమైన ప్రోటోకాల్స్‌ను అమలు చేస్తున్నామని వెల్లడించింది.

టోటలైజర్‌ యంత్రాలను ప్రవేశపెడితే ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు పెరిగే అవకాశం ఉందని కూడా ఈసీ పేర్కొంది.

ఈ విధానాన్ని తీసుకురావాలంటే ముందుగా రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం అవసరమని స్పష్టం చేసింది.

ఆ ఏకాభిప్రాయం ఆధారంగా సంబంధిత ఎన్నికల నిబంధనల్లో మార్పులు చేయాల్సి ఉంటుందని, ఇందుకోసం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాల్సి ఉంటుందని తెలిపింది.

ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే నిరాధార ఆరోపణలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అఫిడవిట్‌లో కేంద్ర ఎన్నికలసంఘం పేర్కొంది.

ADVERTISEMENT