Manipur: మణిపూర్ లో మరోసారి ఘర్షణ.. టియర్ గ్యాస్ ఉపయోగించిన భద్రతా దళాలు
ఈ వార్తాకథనం ఏంటి
మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. మంగళవారం కాంగ్‌పోక్పి జిల్లాలో కుకీ కమ్యూనిటీకి చెందిన మహిళలు భద్రతా బలగాలతో ఘర్షణకు దిగారు.
ఈ ఘర్షణ తర్వాత ఆ ప్రాంతంలో పరిస్థితి తీవ్రతరమైంది. భద్రతా బలగాలు స్వల్పంగా లాఠీచార్జి చేసి జనాన్ని చెదరగొట్టగా, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, ప్రశాంతంగా ఉందని తెలిపారు.
ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ రాష్ట్రంలోని హింసాత్మక ఘటనలపై క్షమాపణలు చెప్పిన కొద్ది గంటలకే ఈ సంఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
భద్రతా బలగాల ప్రకటన ప్రకారం, థమ్నాపోక్పికి సమీపంలోని ఉయోక్చింగ్ ప్రాంతంలో భద్రతా బలగాల ఉమ్మడి బృందాన్ని మోహరించడాన్ని అడ్డుకునేందుకు గుంపులు ప్రయత్నించగా, ఈ సంఘటన జరిగింది.
ఆ తరువాత, భద్రతా బలగాలు తేలికపాటి శక్తిని ఉపయోగించి గుంపును చెదరగొట్టాయి.
వివరాలు
భారీగా నిరసనకు దిగిన మహిళలు
ప్రస్తుతం ఆ ప్రాంతంలో పరిస్థితి అదుపులో ఉందని, శాంతిభద్రతలను కాపాడేందుకు భద్రతా బలగాలను మోహరించామని చెప్పారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఇక ట్విచింగ్‌లోని సైబోల్ గ్రామంలో భద్రతా బలగాల చర్యల కారణంగా అనేక మంది గాయపడ్డారని స్థానికులు పేర్కొన్నారు.
కుకీ-నియంత్రిత కొండ ప్రాంతాలు, మెయిటీ ఆధిపత్యం ఉన్న ఇంఫాల్ లోయ మధ్య బఫర్ జోన్‌గా పిలువబడే ఈ ప్రాంతంలో, భద్రతా సిబ్బంది కమ్యూనిటీ బంకర్లను బలవంతంగా ఆక్రమించడాన్ని నిరసిస్తూ మహిళలు భారీగా నిరసనకు దిగారు.
భద్రతా బలగాలు ఆందోళనకారులను చెదరగొట్టడానికి టియర్ గ్యాస్‌ను ప్రయోగించడంతో పరిస్థితి మరింత దారుణంగా మారిందని కుకీ సంఘం నాయకులు ఆరోపించారు. ఈ ఘటన రణరంగానికి దారితీసింది.
వివరాలు
క్షమాపణలు చెప్పిన ముఖ్యమంత్రి బీరెన్ సింగ్
కాగా, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ హింసాత్మక ఘటనలపై రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణలు తెలిపారు.
ఈ ఏడాది ఎంతో దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. "మే 3నుంచి ఇప్పటి వరకు జరిగిన ఘటనలన్నింటికీ నేను క్షమాపణలు కోరుతున్నాను. అనేకమంది తమ సన్నిహితులను కోల్పోయారు, ఇళ్లను వదిలి వెళ్లిపోయారు. రాష్ట్ర ప్రజలకు నా గుండె నుండి క్షమాపణలు తెలియజేస్తున్నాను" అని సీఎం అన్నారు.