Cyclone Murasu: తీవ్ర తుపానుగా మారిన మురసు.. తీరం దాటే సమయంలో 120 కి.మీ. వేగంతో గాలులు
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుపాను తీవ్ర తుపానుగా బలపడింది. గత ఆరు గంటల్లో గంటకు 20 కిలోమీటర్ల వేగంతో కదిలినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం చెన్నైకి 260 కిలోమీటర్లు,నెల్లూరుకు 290 కిలోమీటర్లు,కావలికి 310 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 320 కిలోమీటర్లు, ఒంగోలుకు 330 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 470 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిపింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము మధ్య నెల్లూరు-నరసాపురం మధ్య ఒంగోలు సమీపంలో తుపాను తీరం దాటే అవకాశముందని అంచనా వేసింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, గరిష్ఠంగా 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయవచ్చని పేర్కొంది.
వివరాలు
భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మురసు తుపాను ప్రభావంతో సోమ, మంగళవారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
సోమవారం కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని చెప్పారు.
ఒకటి, రెండు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు పడవచ్చని వెల్లడించారు.
ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
వివరాలు
సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు
అల్లూరి, పోలవరం, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడవచ్చని తెలిపారు. నంద్యాల, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లోనూ కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు.
తుపాను నేపథ్యంలో సహాయక చర్యల కోసం ముందస్తుగా ఆరు ఎన్డీఆర్‌ఎఫ్, ఏడు ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధం చేసినట్లు ప్రఖర్ జైన్ వెల్లడించారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.