Shigella infections: కేరళలో షిగెల్లా బ్యాక్టీరియా కలకలం.. మలప్పురంలో 75 కేసులు
ఈ వార్తాకథనం ఏంటి
కేరళలోని మలప్పురం జిల్లాలో షిగెల్లా బ్యాక్టీరియా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలోని మూడు ప్రాంతాల్లో తాజాగా ఈ ఇన్ఫెక్షన్ కేసులు బయటపడటంతో ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఈ ఏడాది ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 75 కేసులు నమోదయ్యాయి. వీరిలో ఎనిమిది మంది బాధితులతో సన్నిహితంగా మెలిగినవారికి కూడా ఇన్ఫెక్షన్ సోకినట్లు అధికారులు గుర్తించారు. వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా నిఘాను ముమ్మరం చేయడంతో పాటు నివారణ చర్యలు చేపట్టారు. మలప్పురం జిల్లాలోని అరీకోడ్, పుల్పట్ట, ఎడవన్న ప్రాంతాల్లో తాజాగా షిగెల్లా ఇన్ఫెక్షన్ కేసులు వెలుగుచూశాయి. ఈ పరిణామంతో జిల్లా స్థాయి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అత్యవసరంగా సమావేశమైంది. ప్రస్తుత పరిస్థితిని సమీక్షించి, వ్యాధి ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది.
వివరాలు
కలుషిత ఆహారం,నీటితో వ్యాప్తి
షిగెల్లా అనేది బ్యాక్టీరియా కారణంగా వచ్చే పేగుల ఇన్ఫెక్షన్. ముఖ్యంగా చిన్నారుల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది.
కలుషితమైన నీరు తాగడం, ఎక్కువసేపు నిల్వ ఉంచిన ఆహారం తీసుకోవడం, సరిగా ఉడకని పదార్థాలు తినడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ సోకుతుంది.
వ్యాధి సోకిన వ్యక్తుల మలంతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఏర్పడినా బ్యాక్టీరియా ఇతరులకు వ్యాపించే అవకాశం ఉంది.
సాధారణంగా ఇన్ఫెక్షన్ సోకిన ఒకటి, రెండు రోజుల్లో లక్షణాలు బయటపడతాయి.
వివరాలు
ఈ లక్షణాలుంటే జాగ్రత్త
షిగెల్లా ఇన్ఫెక్షన్ సోకినవారిలో విరేచనాలు, మలంలో రక్తం లేదా చీము, తీవ్రమైన కడుపునొప్పి, జ్వరం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
శరీరంలో నీటి శాతం తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంది. లక్షణాలు కనిపించని పిల్లల నుంచి సైతం మలం ద్వారా బ్యాక్టీరియా ఇతరులకు వ్యాపించవచ్చని మలప్పురం జిల్లా వైద్యాధికారి డాక్టర్ వి. వినోద్ హెచ్చరించారు.
చికిత్స తీసుకోవడంలో ఆలస్యం చేస్తే మెదడు, మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయం కూడా సంభవించవచ్చని తెలిపారు.
వివరాలు
బహిరంగ విందులపై తాత్కాలిక నిషేధం
వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో బహిరంగ విందుల నిర్వహణపై అధికారులు తాత్కాలికంగా నిషేధం విధించారు.
ఆరోగ్యశాఖ, స్థానిక స్వపరిపాలన శాఖ, ఆహార భద్రత విభాగం కలిసి ఆహార పదార్థాల తయారీ, నిల్వ, పంపిణీ కేంద్రాల్లో తనిఖీలు చేపట్టనున్నాయి.
ఆహార భద్రత నిబంధనలు పాటించని సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
వివరాలు
తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..
షిగెల్లా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఆహారం, తాగునీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ సూచించింది.
తాగడానికి, వంట చేయడానికి నీటిని బాగా మరిగించి చల్లార్చిన తర్వాతే ఉపయోగించాలి.
తాజాగా తయారు చేసిన, పూర్తిగా ఉడికించిన ఆహారాన్నే తీసుకోవాలి.
నిల్వ ఉంచిన ఆహారం, మూతలు లేకుండా బయట ఉంచిన పదార్థాలు, వీధుల్లో విక్రయించే ఆహారానికి దూరంగా ఉండాలి.
వివరాలు
తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..
తాగునీటి వనరులకు క్రమం తప్పకుండా క్లోరినేషన్ చేయాలి.
పండ్లు, కూరగాయలను శుభ్రంగా కడిగిన తర్వాతే వినియోగించాలి. భోజనం చేసే ముందు, వంట ప్రారంభించే ముందు, మరుగుదొడ్డికి వెళ్లి వచ్చిన తర్వాత తప్పనిసరిగా సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలి.
విరేచనాలు ప్రారంభమైన వెంటనే బాధితులకు ఓఆర్‌ఎస్ ద్రావణం, ఉప్పు కలిపిన గంజి లేదా కొబ్బరినీళ్లు ఇవ్వాలని అధికారులు సూచించారు.
వ్యాధి లక్షణాలు కనిపించినప్పుడు సొంతంగా మందులు వాడకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.