Shobha Karandlaje: నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నాను.. నన్ను క్షమించండి: కేంద్ర మంత్రి పోస్టు
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పెట్టిన వ్యక్తికి సంబంధించిన ప్రాంతం గురించి బీజేపీ నేత , కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దాంతో మంత్రి క్షమాణలు చెప్పాల్సివచ్చింది. ఆమె తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు ఎక్స్ లో పోస్టు పెట్టారు. ఇంతకీ ఏం జరిగిందంటే..? రామేశ్వరం పేలుళ్ల నిందితుడు మల్నాడు వాసి అని,గతంలో తమిళనాడులోని కృష్ణగిరి అటవీ ప్రాంతంలో ఆయుధాలను వినియోగించడంలో ఇచ్చే శిక్షణ పొందారని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే అన్నారు. దాంతో మంత్రి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఈ ఆరోపణలపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమెపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బాంబు పేలిన ఘటనలో 9మందికి గాయాలు
తన వ్యాఖ్యలు దుమారం రేపడంతో సోషల్ మీడియా వేదికగా ఆమె క్షమాపణలు తెలియజేశారు. వివాదం నేపథ్యంలో కరంద్లాజే "తమిళ సోదరులు మరియు సోదరీమణులకు, నేను చేసిన వ్యాఖ్యలు ఏ ఒక్క వర్గాన్ని ఉద్దేశించినవని కాదని తమిళనాడు ప్రజలకు స్పష్టత ఇవ్వాలని అనుకుంటున్నాను. కృష్ణగిరిలో శిక్షణ పొందిన నిందితుడిని ఉద్దేశించే నేను మాట్లాడాను అయినా నా వ్యాఖ్యలు కొందరికి బాధ కలిగించాయని అర్థమైంది. అందుకు క్షమాపణలు తెలియజేస్తున్నాను. నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను' అని ఆమె పోస్టు పెట్టారు. ఈ నెల ఒకటో తేదీన బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్‌లో ఉన్న రామేశ్వరం కెఫేలో బాంబు పేలిన ఘటనలో 9 మంది గాయపడిన సంగతి తెలిసిందే.