Loading...
Tiger Shroff firing: బాలీవుడ్‌ను వణికిస్తున్న అనిల్ పండిత్.. టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల వెనుక ఇతనేనా?
టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. తెరపైకి అనిల్ పండిత్ పేరు.. అసలెవరితను?

Tiger Shroff firing: బాలీవుడ్‌ను వణికిస్తున్న అనిల్ పండిత్.. టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల వెనుక ఇతనేనా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 19, 2026
11:17 am

ఈ వార్తాకథనం ఏంటి

దసరా వేళ వాణిజ్య రాజధాని ముంబయి మరోసారి ఉలిక్కిపడింది. సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే పండుగ సమయంలో మాజీ మంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత బాబా సిద్ధిఖీ (Baba Siddique) హత్యకు గురయ్యారు. ఇప్పుడు బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ (Tiger Shroff)ను కొందరు దుండగులు లక్ష్యంగా చేసుకోవడం కలకలం రేపుతోంది. ఈ ఘటనలో నటుడు ప్రాణాలతో బయటపడినప్పటికీ, గన్‌పౌడర్ కారణంగా కొన్ని చోట్ల కాలిన గాయాలైనట్లు సమాచారం. ఈ కాల్పుల ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో కాల్పులకు ముందు నిందితుల కదలికలకు సంబంధించిన కొన్ని దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. మరోవైపు, అమెరికాకు చెందిన గ్యాంగ్‌స్టర్ అనిల్ పండిత్ ఈ కాల్పులకు తానే బాధ్యుడినంటూ ప్రకటించుకున్నట్లు సమాచారం.

వివరాలు

ఎవరీ అనిల్ పండిత్?

ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్‌ను పలు భద్రతా సంస్థలకు పంపినట్లు తెలుస్తోంది. అయితే ఆ ఆడియో క్లిప్‌లోని అంశాలకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేదు.

ఆదివారం సాయంత్రం ముంబయిలోని జుహు ప్రాంతంలో జరిగిన కాల్పులకు తానే బాధ్యుడినంటూ అనిల్ పండిత్ హిందీ చిత్ర పరిశ్రమను ఉద్దేశించి బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం.

ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi), బిష్ణోయ్ సమాజానికి క్షమాపణలు చెప్పాలని అతడు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేసేవారిని చంపేస్తామని కూడా హెచ్చరించినట్లు సమాచారం. టైగర్ ష్రాఫ్‌కు ఇప్పటికే హెచ్చరికలు చేసినప్పటికీ ఆయన పట్టించుకోలేదన్నారు.

వివరాలు

హరియాణా నుంచి అమెరికాకు.. బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధాలున్నాయా?

ఇకపై ఇదే తన నుంచి వచ్చే చివరి హెచ్చరిక అని ఆడియో క్లిప్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

సల్మాన్ ఖాన్ కుటుంబ సభ్యులకు కూడా బెదిరింపులు పంపినట్లు సమాచారం.

అయితే ఈ ఆడియో క్లిప్ నిజమైనదా? అందులోని వ్యాఖ్యలు అనిల్ పండిత్ చేసినవేనా? అనే విషయాలపై ఇంకా స్పష్టత లేదు.

అనిల్ పండిత్ హరియాణాలోని పానిపట్‌కు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. 2024లో అక్రమ వలస మార్గమైన 'డంకీ రూట్‌' ద్వారా అమెరికాకు వెళ్లినట్లు సమాచారం.

ఆ తర్వాత అతడు బిష్ణోయ్ గ్యాంగ్‌తో కలిసి పనిచేయడం ప్రారంభించినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. భారత్‌లో ఉన్న సమయంలో అనిల్ పండిత్‌పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు.

ADVERTISEMENT

వివరాలు

పలు కేసులు నమోదైనట్ల సమాచారం

అమెరికాకు వెళ్లిన తర్వాత మాత్రం అతడిపై పలు కేసులు నమోదైనట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి.

తాజా ఆడియో క్లిప్‌లో లారెన్స్ బిష్ణోయ్ పేరు ప్రస్తావించినప్పటికీ, అనిల్ పండిత్ నేరుగా అతడి నుంచి ఆదేశాలు అందుకోవడం లేదని సంబంధిత వర్గాలు తెలిపినట్లు సమాచారం.

అనిల్ పండిత్‌కు హ్యాండ్లర్‌గా హారీ బాక్సర్‌ (హరిచంద్ జాట్) వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అతడు 2022 నుంచి అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీల్లో హారీ బాక్సర్‌పై దోపిడీ, హత్యాయత్నానికి సంబంధించిన కేసులు ఉన్నట్లు కథనాలు వెల్లడించాయి.

ADVERTISEMENT

వివరాలు

బాలీవుడ్ ప్రముఖులే లక్ష్యంగా వరుస కాల్పులు?

ఈ ఏడాది బాలీవుడ్‌కు చెందిన పలువురు వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. ఫిబ్రవరిలో బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి(Rohit Shetty) నివాసం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు పలుమార్లు కాల్పులు జరిపారు.

ఆ ఘటనలో రోహిత్ శెట్టికి ఎలాంటి గాయాలు కాలేదు. అలాగే జూన్‌లో పంజాబీ సింగర్ గురురంధ్వాకు చెందిన జిమ్‌ను లక్ష్యంగా చేసుకుని దుండగులు కాల్పులకు తెగబడినట్లు సమాచారం.

ఈ ఘటనకు తామే బాధ్యులమంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు అనిల్ పండిత్ అప్పట్లో సోషల్ మీడియా వేదికగా ప్రకటించుకున్నట్లు కథనాలు వెల్లడించాయి.

బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్‌తో గురురంధ్వాకు సాన్నిహిత్యం పెరుగుతోందనే కారణంతోనే ఈ దాడికి పాల్పడినట్లు అనిల్ పండిత్ పేర్కొన్నట్లు సమాచారం.

వివరాలు

సల్మాన్ ఖాన్‌తో బిష్ణోయ్ గ్యాంగ్‌కు వైరం ఎందుకు?

తాజా టైగర్ ష్రాఫ్ ఘటనతో మరోసారి బాలీవుడ్ ప్రముఖులకు వస్తున్న బెదిరింపులు, భద్రతకు సంబంధించిన అంశాలు చర్చనీయాంశంగా మారాయి.

సల్మాన్ ఖాన్‌కు, బిష్ణోయ్ గ్యాంగ్‌కు మధ్య ఉన్న విభేదాలకు 1998 నాటి కృష్ణజింకల వేట కేసు ప్రధాన కారణంగా చెబుతారు.

1998 అక్టోబర్ 1న 'హమ్ సాథ్ సాథ్ హై' (Hum Saath Saath Hain) సినిమా షూటింగ్ సమయంలో జోధ్‌పుర్ పరిసర ప్రాంతాల్లో సల్మాన్ ఖాన్‌తో పాటు మరికొందరు బాలీవుడ్ నటులు కృష్ణజింకలను వేటాడినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఈ కేసు 'బ్లాక్‌బక్ పోచింగ్ కేసు'గా(Blackbuck Poaching Case)ప్రసిద్ధి చెందింది. ఈ కేసులో జోధ్‌పుర్ ట్రయల్ కోర్టు 2018 ఏప్రిల్ 5న సల్మాన్ ఖాన్‌ను దోషిగా తేల్చి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.

వివరాలు

సల్మాన్ ఖాన్ క్షమాపణలు చెప్పాలి

ఆ శిక్షకు సంబంధించిన వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ కేసులో మిగతా నటులు నిర్దోషులుగా తేలారు.

బిష్ణోయ్ సమాజం కృష్ణజింకలను అత్యంత పవిత్రమైనవిగా భావిస్తుంది.

ఈ నేపథ్యంలో కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ క్షమాపణలు చెప్పాలని బిష్ణోయ్ గ్యాంగ్ డిమాండ్ చేస్తోంది.

ఈ వివాదమే సల్మాన్ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు రావడానికి ప్రధాన కారణంగా ప్రచారంలో ఉంది.

ADVERTISEMENT