LOADING...
Raghav Chadha: నా తప్పేంటి..? ఆమ్‌ ఆద్మీకి రాఘవ్‌ చడ్డా వీడియో మెసేజ్
నా తప్పేంటి..? ఆమ్‌ ఆద్మీకి రాఘవ్‌ చడ్డా వీడియో మెసేజ్

Raghav Chadha: నా తప్పేంటి..? ఆమ్‌ ఆద్మీకి రాఘవ్‌ చడ్డా వీడియో మెసేజ్

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 03, 2026
11:14 am

ఈ వార్తాకథనం ఏంటి

రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉపనేతగా ఉన్న రాఘవ్‌ చడ్డాను ఆ పార్టీ హఠాత్తుగా తప్పించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయంపై గురువారం స్పందించిన చడ్డా..తాను చేసిన తప్పేంటో చెప్పాలని పార్టీని బహిరంగంగా ప్రశ్నించారు. తన స్వరాన్ని అణిచివేయాలనే ప్రయత్నం జరుగుతోందని పేర్కొంటూ వీడియో సందేశం విడుదల చేశారు. పార్లమెంట్‌లో మాట్లాడే ప్రతి అవకాశాన్ని ప్రజా సమస్యలకే వినియోగిస్తానని చడ్డా స్పష్టం చేశారు. తాను ప్రస్తావించే అంశాలు సాధారణంగా సభలో చర్చకు రావని,కానీ ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడం తప్పా అని ప్రశ్నించారు. విమానాశ్రయాల్లో అధిక ఆహార ధరలు,గిగ్‌ వర్కర్ల ఇబ్బందులు,టోల్‌ ప్లాజాల వద్ద దోపిడీ,టెలికాం సంస్థల రీఛార్జ్ విధానాలు వంటి విషయాలను లేవనెత్తడం పార్టీకి లాభమే కాని నష్టమేమిటని ప్రశ్నించారు.

వివరాలు 

చడ్డా భాజపాలో చేరే అవకాశం 

అదేవిధంగా, తనకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని స్వయంగా పార్టీనే రాజ్యసభ అధికారులకు తెలిపిందని ఆరోపించారు. తన గళాన్ని అణచివేయగలరేమో కానీ తన సంకల్పాన్ని దెబ్బతీయలేరని స్పష్టం చేశారు. ప్రజలు తనకు అండగా ఉన్నారని, వారి కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని చెప్పారు. తాను నదిలాంటివాడినని, సమయం వచ్చినప్పుడు వరదలా స్పందిస్తానని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, రాజ్యసభలో డిప్యూటీ లీడర్‌గా ఉన్న చడ్డాను తప్పించిన ఆప్‌.. ఆ స్థానంలో మరో ఎంపీ అశోక్ మిత్తల్‌ను నియమించింది. పార్టీ కార్యకలాపాలకు చడ్డా దూరంగా ఉండటం, ముఖ్య కార్యక్రమాలపై స్పందించకపోవడం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇదే సమయంలో చడ్డా భాజపాలో చేరవచ్చనే ఊహాగానాలు వినిపిస్తుండటంతో ఈ పరిణామం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement