LOADING...
Siya Goyal : 'నా కూతురే హంతకురాలైతే.. అదే కోటపై నుంచి తోసేయండి': సియా తండ్రి
'నా కూతురే హంతకురాలైతే.. అదే కోటపై నుంచి తోసేయండి': సియా తండ్రి

Siya Goyal : 'నా కూతురే హంతకురాలైతే.. అదే కోటపై నుంచి తోసేయండి': సియా తండ్రి

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 26, 2026
09:46 am

ఈ వార్తాకథనం ఏంటి

పుణెకు చెందిన వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సియా గోయల్ కుటుంబ సభ్యులు తొలిసారిగా స్పందించారు. కేతన్ మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన సియా తండ్రి ప్రవీణ్ గోయల్, ఒకవేళ తన కుమార్తెనే ఈ హత్యకు బాధ్యురాలని తేలితే ఎలాంటి కనికరం చూపొద్దని అన్నారు. కేతన్ పడిపోయిన అదే కోటపై నుంచి ఆమెను కూడా తోసేయాలని వ్యాఖ్యానించారు.

వివరాలు 

ఉదయ్‌పూర్‌లో ఘనంగా పెళ్లి చేయాలని ఎన్నో కలలు కన్నాం: ప్రవీణ్ గోయల్

ప్రవీణ్ గోయల్ మాట్లాడుతూ.. "జరిగిన ఘటన అత్యంత విషాదకరం. ఇప్పటికీ ఈ విషయం మేము నమ్మలేకపోతున్నాం. కేతన్ వారి కుటుంబానికే కాదు, మాకూ కుమారుడిలాంటి వాడు. కొద్దికాలంలోనే అతనితో ఎంతో అనుబంధం ఏర్పడింది. ఉదయ్‌పూర్‌లో ఘనంగా పెళ్లి చేయాలని ఎన్నో కలలు కన్నాం. కానీ ఒక్క ఘటనతో ఆ కలలన్నీ చిద్రమయ్యాయి. నా కూతురే నేరానికి పాల్పడిందని తేలితే ఆమెకు కూడా అత్యంత కఠిన శిక్ష విధించాలి. హత్య చేసిన వారిని కేతన్ పడిపోయిన అదే కోటపై నుంచి తోసేయాలి. అది నా కూతురు అయినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు" అని భావోద్వేగంతో చెప్పారు.

వివరాలు 

స్పందించిన సియా గోయల్ తల్లి

ఈ ఘటనపై సియా గోయల్ తల్లి కూడా స్పందించారు. కేతన్ హత్యలో బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. "ఈ వార్త తెలిసిన వెంటనే తీవ్ర షాక్‌కు గురయ్యాను. కేతన్ చాలా మంచి అబ్బాయి. ఈ ఘటనతో రెండు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. ఒకవేళ నా కూతురే దోషి అని తేలితే ఆమెకు కూడా కఠిన శిక్ష విధించాలి. కేతన్‌ను తోసిన అదే చోట ఆమెను కూడా తోసేయాలి" అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సియా గోయల్, చేతన్ చౌదరి కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు.

Advertisement

వివరాలు 

ప్రణాళిక ప్రకారమే కేతన్‌ను హత్య చేసినట్లు పోలీసుల అనుమానం 

అయితే కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగా సియాకు కేతన్ అగర్వాల్‌తో నిశ్చితార్థం జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది. జూన్ 18న మహారాష్ట్రలోని లోహగడ్ కోటకు వెళ్లిన సమయంలో ముందస్తు ప్రణాళిక ప్రకారమే కేతన్‌ను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనకు ముందు నెల రోజుల వ్యవధిలో సియా, చేతన్ మధ్య రెండు వేలకుపైగా ఫోన్ కాల్స్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. హత్యను ఎలా అమలు చేయాలనే అంశంపై ఇంటర్నెట్‌లో కూడా పలుమార్లు సమాచారం కోసం వెతికినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక ఆధారాల ఆధారంగా పోలీసులు సియా గోయల్, చేతన్ చౌదరి ఇద్దరినీ అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోందని, పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Advertisement