Anantapur: అనంతపురంలో 192.68 ఎకరాల వక్ఫ్ భూముల్లో సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు
ఈ వార్తాకథనం ఏంటి
వక్ఫ్ ఆస్తులను స్థిరమైన ఆదాయ వనరులుగా మార్చేందుకు వక్ఫ్ బోర్డు చర్యలు చేపట్టింది. పరిశ్రమల ఏర్పాటుకు అనువైన భూములు, స్థలాలను గుర్తించి లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. దీనివల్ల బోర్డుకు అదనపు ఆదాయం సమకూరడంతో పాటు భూముల ఆక్రమణలను అరికట్టవచ్చని భావిస్తోంది. ఈ క్రమంలో అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలోని 192.68 ఎకరాల వక్ఫ్ భూములను సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు లీజుకివ్వాలన్న ప్రతిపాదనకు బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. తదుపరి అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన తర్వాత టెండర్ల ప్రక్రియ చేపట్టనున్నారు. లీజుకు తీసుకునే సంస్థకే ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలను అప్పగించనున్నారు.
వివరాలు
ఆదాయం 8.36 రెట్లు పెరిగే అవకాశం
అనంతపురం జిల్లా వజ్రకరూరు,గుళ్లపాళ్యం ప్రాంతాల్లోని జామియా మసీదు,మకాన్‌లకు చెందిన మొత్తం 241.62 ఎకరాల భూములు ప్రస్తుతం వక్ఫ్ బోర్డు ప్రత్యక్ష నిర్వహణలో ఉన్నాయి.
ఈ భూములను లీజుకు ఇవ్వడం ద్వారా ఏటా రూ.7.14లక్షల ఆదాయం వస్తోంది.
వీటిలో సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు అనువైన 192.68ఎకరాలను లీజుకు కేటాయిస్తే ఆదాయం గణనీయంగా పెరుగుతుందని వక్ఫ్ బోర్డు అధికారులు ప్రతిపాదించారు.
ఎకరానికి ఏడాదికి రూ.31వేల అద్దె చొప్పున కేటాయిస్తే మొత్తం రూ.59.73లక్షల ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు.
ప్రస్తుతం వస్తున్న రూ.7.14 లక్షలతో పోలిస్తే ఇది దాదాపు 8.36 రెట్లు అధికమని పేర్కొన్నారు.
టెండర్ల సమయంలో సంస్థల మధ్య పోటీని బట్టి ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వానికి సమర్పించిన ప్రతిపాదనలో వివరించారు.
వివరాలు
పేద ముస్లింల సంక్షేమానికి ఆదాయం
వక్ఫ్ భూముల ద్వారా లభించే స్థిరమైన ఆదాయాన్ని పేద ముస్లింల సంక్షేమానికి వినియోగించనున్నట్లు వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు.
వారి పిల్లల ఉన్నత విద్యకు కూడా ఈ నిధులను ఖర్చు చేస్తామని వెల్లడించారు.
భూములను విక్రయించకుండా 30 ఏళ్లపాటు లీజుకు ఇవ్వడం వల్ల వాటి యాజమాన్య హక్కులు వక్ఫ్ పరిధిలోనే కొనసాగుతాయని వివరించారు.
ఈ విధానం ద్వారా వక్ఫ్ ఆస్తులను కాపాడటంతో పాటు వాటి నుంచి దీర్ఘకాలిక ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చని బోర్డు భావిస్తోంది.