Loading...
Haryana: యమునా నదిలో ఆర్మీ బోటు బోల్తా.. ఇద్దరు జవాన్లు గల్లంతు?
యమునా నదిలో ఆర్మీ బోటు బోల్తా.. ఇద్దరు జవాన్లు గల్లంతు?

Haryana: యమునా నదిలో ఆర్మీ బోటు బోల్తా.. ఇద్దరు జవాన్లు గల్లంతు?

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 02, 2026
11:59 am

ఈ వార్తాకథనం ఏంటి

హర్యానా-హిమాచల్‌ ప్రదేశ్ సరిహద్దులోని యమునానగర్ హత్నీకుండ్ బ్యారేజీ సమీపంలో భారత సైన్యం నిర్వహిస్తున్న మాక్ డ్రిల్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వరదల సమయంలో చేపట్టే సహాయక చర్యలపై నిర్వహిస్తున్న ఫ్లడ్ రెస్క్యూ ఎక్సర్‌సైజ్‌లో భాగంగా సైనికులు ప్రయాణిస్తున్న మోటారు బోటు యమునా నదిలో బోల్తాపడి మునిగిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు గల్లంతైనట్లు ప్రాథమిక సమాచారం.

వివరాలు 

డేంజర్ జోన్ వైపు వెళ్లిన బోటు

ప్రాథమికంగా అందుతున్న వివరాల ప్రకారం.. ఆర్మీకి చెందిన 'వన్ పారా స్పెషల్ ఫోర్స్' బలగాలు హత్నీకుండ్ బ్యారేజీ పరిసరాల్లో విన్యాసాలు చేపట్టాయి.

ఇందులో భాగంగా సైనికులు మోటారు బోటులో ప్రయాణిస్తుండగా.. అది అనుకోకుండా యమునా నదిలోని ప్రమాదకర ప్రాంతం వైపు వెళ్లింది.

అక్కడ నీటి ప్రవాహం అత్యంత వేగంగా ఉండటంతో బోటు అదుపుతప్పి ఒక్కసారిగా తిరగబడి నదిలో మునిగిపోయింది.

దీంతో బోటులో ఉన్న జవాన్లు తీవ్ర ఉధృతితో ప్రవహిస్తున్న నీటిలో చిక్కుకున్నారు.

అయితే వారిలో ముగ్గురు సైనికులు సుమారు 600 మీటర్ల దూరం వరకు ఈదుకుంటూ వెళ్లి సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.

మరో ఇద్దరు జవాన్ల ఆచూకీ మాత్రం లభించకపోవడంతో గల్లింపు చర్యలు చేపట్టారు.

వివరాలు 

ముమ్మరంగా గాలింపు చర్యలు

ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే సైనిక బలగాలు,హర్యానా-ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల పోలీసులు,ఎస్డీఆర్ఎఫ్ సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి.

గల్లంతైన సైనికుల కోసం నదిలో గాలింపు ప్రారంభించాయి.ఈ క్రమంలో ప్రమాదానికి గురైన మోటారు బోటును నదిలో నుంచి బయటకు తీశారు.

అయినప్పటికీ గల్లంతైన జవాన్ల జాడ ఇంకా తెలియరాలేదు.యమునా నదిలో ప్రవాహ వేగం అధికంగా ఉండటంతో సహాయక,గాలింపు చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

మరోవైపు ప్రమాదం ఎలా జరిగింది?బోటులో మొత్తం ఎంతమంది సైనికులు ఉన్నారు?వంటి అంశాలపై పూర్తి సమాచారం ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు.

జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశం కావడంతో ఈ ఘటనపై మరిన్ని వివరాలను వెల్లడించేందుకు ప్రతాప్‌నగర్ పోలీసులు నిరాకరించారు.

ప్రస్తుతం గల్లంతైన జవాన్ల కోసం నదిలో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

ADVERTISEMENT