Loading...
Sonia Gandhi: మమ్మీ.. మమ్మీ అంటూ పిలిచా.. ఇందిర చివరి క్షణాలను గుర్తుచేసుకున్న సోనియా
మమ్మీ.. మమ్మీ అంటూ పిలిచా.. ఇందిర చివరి క్షణాలను గుర్తుచేసుకున్న సోనియా

Sonia Gandhi: మమ్మీ.. మమ్మీ అంటూ పిలిచా.. ఇందిర చివరి క్షణాలను గుర్తుచేసుకున్న సోనియా

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 09, 2026
11:19 am

ఈ వార్తాకథనం ఏంటి

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యకు గురైన సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ గుర్తుచేసుకున్నారు. కాల్పుల శబ్దం విని బయటకు వచ్చి చూడగా.. తన అత్తగారు రక్తపు మడుగులో కనిపించారని వెల్లడించారు. ఆమెను మమ్మీ.. మమ్మీ అంటూ పిలిచినా ఎలాంటి స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నవంబర్‌ 10న విడుదల కానున్న తన ఆత్మకథ 'బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌'లో ఈ విషయాలను వివరించారు. ఇందిరా గాంధీ హత్య తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలోనూ పంచుకున్నారు.

వివరాలు 

కాల్పుల శబ్దం విని బయటకు వచ్చా

ఇందిరా గాంధీ కార్యాలయం తమ నివాసానికి పక్కనే ఉండేదని సోనియా తెలిపారు.

అత్తగారు కార్యాలయానికి బయలుదేరిన తర్వాత తాను తన గదిలోకి వెళ్లానని చెప్పారు.

ఆ సమయంలో వరుసగా కాల్పుల శబ్దాలు వినిపించాయని.. వాటిని విని ఒక్కసారిగా స్తబ్ధుగా ఉండిపోయానని గుర్తుచేసుకున్నారు.

ఇంతలో ఎవరో తన గది తలుపులను గట్టిగా కొట్టడం ప్రారంభించారని చెప్పారు.

తలుపు కొడుతున్నది పిల్లల ఆయా ఒంగ్ము అని గుర్తించానని.. ఆమె గట్టిగా ఏడుస్తూ కనిపించిందని తెలిపారు.

ఏం జరిగిందో తెలియక భయంతో వణికిపోతూనే తలుపు తెరిచానన్నారు.

ఒంగ్ము మాట్లాడలేకపోయిందని.. గార్డెన్‌ వైపు చూపిస్తూ సైగలు చేసిందని వివరించారు. అదే సమయంలో అక్కడికి ఓ అంబాసిడర్‌ కారు వచ్చిందని చెప్పారు.

వివరాలు 

రక్తంతో తడిసిన చీర.. స్పందించని ఇందిర

ఆందోళన, భయం మధ్య కారు దగ్గరకు వెళ్లిన సోనియా.. ఇందిరా గాంధీని అందులోకి ఎక్కిస్తున్న దృశ్యాన్ని చూశారు.

ఆమె పరిస్థితి చూసి ఏం జరిగిందో అర్థమైందని, వెంటనే ఏడవడం ప్రారంభించానని తెలిపారు.

కారు ముందు భాగంలో ఉన్న ఇందిర సహాయకులు గట్టిగా కేకలు వేస్తుండగా.. వెనుక కూర్చున్న తాను ఆమె ముఖం వైపు చూస్తూ ఉండిపోయానని గుర్తుచేసుకున్నారు.

ఇందిర కట్టుకున్న చీర మొత్తం రక్తంతో తడిసిపోయిందని, ఛాతీపైనా రక్తం కనిపించిందని చెప్పారు.

ఆమె కళ్లు పెద్దగా తెరిచి ఉన్నప్పటికీ శరీరంలో ఎలాంటి కదలికలు లేవన్నారు.

మమ్మీ.. మమ్మీ అంటూ పదేపదే పిలుస్తూ మాట్లాడించేందుకు ప్రయత్నించినా ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ADVERTISEMENT

వివరాలు 

ఆసుపత్రికి చేరుకోవడంలో తీవ్ర జాప్యం

ఇందిరను ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలోనూ అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని సోనియా వెల్లడించారు.

కారుకు సైరన్‌ లేకపోవడం, భారీగా ట్రాఫిక్‌ ఉండటంతో ఆసుపత్రికి చేరుకోవడానికి తీవ్ర ఆలస్యమైందని తెలిపారు.

ట్రాఫిక్‌ సిగ్నళ్లను దాటుకుంటూ ఆసుపత్రికి చేరుకున్నప్పటికీ.. వెంటనే లోపలికి అనుమతించలేదన్నారు.

అక్కడంతా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. చివరకు అత్యవసర చికిత్స విభాగానికి చేరుకున్నా.. అక్కడ కూడా కొంతసేపు నిలిపివేశారని తెలిపారు.

అనంతరం వైద్యులు వచ్చి ఇందిరను ఆపరేషన్‌ థియేటర్‌లోకి తీసుకెళ్లారని చెప్పారు.

అసలు ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి తాను లోపలే ఉండాలని భావించినప్పటికీ.. అప్పటికే చాలామంది వైద్యులు అక్కడికి చేరుకున్నారని వివరించారు.

ADVERTISEMENT

వివరాలు 

రాజీవ్‌, పిల్లల గురించి ఆందోళన

ఇందిరను ఆసుపత్రికి తీసుకొచ్చిన సమయంలోనే తన భర్త రాజీవ్‌ గాంధీ, పిల్లలు రాహుల్‌, ప్రియాంకల గురించి ఆందోళన మొదలైందని సోనియా గుర్తుచేసుకున్నారు.

రాజీవ్‌ ఎక్కడ ఉన్నారో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించానని తెలిపారు.

పిల్లలు మాత్రం అప్పటికి పాఠశాలలో ఉన్నారని.. కమాండోలు వెంటనే వారిని ఇంటికి తీసుకొచ్చారని చెప్పారు.

ఇంటికి చేరుకున్న పిల్లలు సిబ్బంది అంతా ఏడుస్తుండటాన్ని చూసి.. నానమ్మకు, అమ్మానాన్నలకు ఏమైందని ప్రశ్నించడం ప్రారంభించారని తెలిపారు.

ఆ సమయంలో పిల్లలతో ఉండాలని అనుకున్నప్పటికీ.. రాజీవ్‌ ఆసుపత్రికి వస్తున్నారని తెలియడంతో తాను అక్కడి నుంచి ఇంటికి వెళ్లలేదని చెప్పారు.

వివరాలు 

మధ్యాహ్నం 2 గంటలకు మరణవార్త

చివరకు మధ్యాహ్నం 2 గంటలకు ఇందిరా గాంధీ మరణించినట్లు వైద్యులు ప్రకటించారని సోనియా వెల్లడించారు.

ఆ సమయంలో రాజీవ్‌ గాంధీ పశ్చిమ బెంగాల్‌లో ఓ బహిరంగ సభలో పాల్గొనేందుకు వెళ్లారు.

అక్కడే ఆయనకు ఇందిరకు గాయాలయ్యాయని, పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది.

బీబీసీ వార్తల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్నారని సోనియా తెలిపారు.

అయితే ఇందిర మరణించిన విషయాన్ని రాజీవ్‌కు ఎవరూ నేరుగా చెప్పకపోయినప్పటికీ.. పరిస్థితిని బట్టి ఏం జరిగిందో ఆయనకు అర్థమైందని తన ఆత్మకథలో సోనియా గాంధీ పేర్కొన్నారు.

ADVERTISEMENT