Sonia Gandhi: ప్రధాని పదవిపై ప్రణబ్ ఆకాంక్ష.. నాటి సంభాషణను గుర్తుచేసుకున్న సోనియా
ఈ వార్తాకథనం ఏంటి
ప్రణబ్ ముఖర్జీ ప్రధానమంత్రి కావాలని ఆశపడ్డారా? 2010లో తనతో జరిగిన ఓ సంభాషణలో ఆయన చేసిన వ్యాఖ్యలు అలాంటి అభిప్రాయాన్ని కలిగించాయని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వెల్లడించారు. తన కొత్త పుస్తకం 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్'లో ఈ ఆసక్తికర విషయాన్ని ఆమె ప్రస్తావించారు. 526 పేజీలతో రూపొందించిన సోనియా గాంధీ పుస్తకం నవంబర్ 10న విడుదలైంది. ఇందులో తన వ్యక్తిగత జీవితం, కాంగ్రెస్ రాజకీయాలు, యూపీఏ ప్రభుత్వంలో జరిగిన పరిణామాలు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలతో తన అనుబంధం గురించి పలు విషయాలను వెల్లడించారు. 2010లో ప్రణబ్ ముఖర్జీ అప్పుడప్పుడు తనతో ప్రత్యేకంగా మాట్లాడేవారని సోనియా గుర్తుచేసుకున్నారు.
వివరాలు
ప్రధానమంత్రి కావాలనే చిరకాల ఆకాంక్ష
ఓ సందర్భంలో నాయకత్వంలో మార్పు రావాల్సిన సమయం ఆసన్నమైందని ప్రణబ్ తనతో అన్నట్లు తెలిపారు.
ఆయన చేసిన ఈ వ్యాఖ్యలను ప్రధానమంత్రి కావాలనే చిరకాల ఆకాంక్షకు సంకేతంగా తాను భావించినట్లు పుస్తకంలో రాశారు.
ప్రణబ్ వ్యాఖ్యలకు తాను సున్నితంగా స్పందించానని, వెంటనే సంభాషణను మరో అంశం వైపు మళ్లించానని సోనియా వెల్లడించారు.
దీంతో ఆయన కొంత నిరాశ చెంది ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే, ఆ తర్వాత కూడా ప్రణబ్ తనతో ఎప్పుడూ స్నేహపూర్వకంగానే వ్యవహరించారని పేర్కొన్నారు.
వివరాలు
భారత 13వ రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ
ప్రధాని పదవి దక్కకపోయినా ప్రణబ్ ముఖర్జీకి కాంగ్రెస్ పార్టీ అత్యున్నత రాజ్యాంగ పదవిని చేపట్టే అవకాశం కల్పించింది.
2012లో యూపీఏ కూటమి తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఆయన పేరును ప్రకటించింది.
అనంతరం జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ప్రణబ్ ముఖర్జీ భారత 13వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు.