నేడు లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ.. మాట్లాడనున్న సోనియా గాంధీ
మహిళా రిజర్వేషన్ బిల్లుపై బుధవారం చర్చ జరగనుంది. అయితే ఈ బిల్లుపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ మాట్లాడనున్నారు. కాంగ్రెస్ తరఫున ఆమె కీలక ప్రసంగం చేయనున్నారు. లోక్‌సభ, అసెంబ్లీలలో మహిళలకు 33శాతం కోటాను కేటాయించాలనే లక్ష్యంతో రూపొందించిన ఈ బిల్లును పార్లమెంటు ప్రత్యేక సమావేశాల సందర్భంగా మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కొత్త పార్లమెంట్ భవనంలో జరిగిన తొలి సమావేశంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మహిళా రిజర్వేషన్ బిల్లును దిగువ సభలో సమర్పించారు. ఈ బిల్లును 2008లో యూపీఏ ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టి, 2010లో ఆమోదించింది. కానీ లోక్‌సభలో ఇది పెండింగ్ లోనే ఉంది.
లోక్‌సభలో 181కి పెరగనున్న మహిళల సీట్లు
మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్ సభలో ప్రవేశపెడుతున్న సందర్భంలో న్యాయశాఖ మంత్రి మేఘ్వాల్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ బిల్లుతో 33శాతం సీట్లను రిజర్వ్ చేయడం ద్వారా మహిళలకు సాధికారత లభిస్తుందని మేఘ్వాల్ పేర్కొన్నారు. బిల్లు ఆమోదం పొందిన తర్వాత లోక్‌సభలో మహిళలకు సీట్ల సంఖ్య 181కి పెరుగుతుందని కూడా ఆయన చెప్పారు. రాజ్యాంగం (128 సవరణ) బిల్లు, 2023, రాజ్యాంగంలో 3కొత్త ఆర్టికల్‌లు, ఒక కొత్త క్లాజ్‌ను ప్రవేశపెడుతుందని మేఘ్వాల్ చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఈ సమావేశాల్లోనే చట్టంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది చట్టంగా మారిన తర్వాత దీని కాల పరిమితి 15ఏళ్లు ఉంటుంది. అయితే ఆ తర్వాత కాలపరిమితిని పెంచుకోవచ్చు.