నైరుతి మరింత ఆలస్యం.. వచ్చే 4 వారాల పాటు రుతుపవనాలు లేవు, వర్షాల్లేవ్
ప్రస్తుత ఖరీఫ్ సీజన్ పై రుతుపవనాలు మందగమనం ప్రతికూల ప్రభావమే ఉండబోతుందని తెలుస్తోంది. ఈ మేరకు ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది. దీనికి కారణం, రానున్న మరో నాలుగు వారాల పాటు రుతుపవనాల కదిలకలు నెమ్మదిగా సాగుతుండటమేనని వివరించింది. రుతుపవనాలు చురుగ్గా కదలట్లేదని, ఫలితంగా వర్షాలు సరిగ్గా పడకపోవచ్చని స్కైమెట్ చెబుతోంది. జూలై 6 వరకు అంటే మరో నాలుగు వారాల పాటు వర్ష సూచన పెద్దగా లేదని స్కైమెట్ ఎక్స్‌టెండెడ్ రేంజ్ ప్రిడిక్షన్ సిస్టమ్ నివేదిక ద్వారా స్పష్టం చేసింది. రుతుపవనాల ఆలస్య రాకతో వర్షాల రాక ఆలస్యమవుతోందని, ఫలితంగా వ్యవసాయదారులకు ఇబ్బందులు తప్పేలా లేవని స్కైమెట్ పేర్కొంది.
ఈసారి వర్షాలు లేక భారత్ కు నీటి సంకటం : స్కైమెట్
నైరుతి రుతుపవనాలు నెమ్మదిగా సాగటం వల్ల మధ్య భారత్ సహా పశ్చిమ ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని స్కైమెట్ తాజా నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈనెల 8న నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. అప్పటికే అవి దాదాపు 7 రోజులు ఆలస్యంగా రావడం గమనార్హం. మరోవైపు బిపర్‌జాయ్ తుఫాన్ వల్ల రుతుపవనాలు ఆలస్యమయ్యాయి. దాని కారణంగా ఇప్పుడా రుతుపవనాలు ముందుకు సాగేందుకు వీలు లేకుండాపోవడం గమనార్హం. కనీసం జూన్ 15 నాటికైనా నైరుతు రుతుపవనాలు మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, చత్తీస్‌గడ్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలకు చేరుకోవాల్సి ఉందన్నారు. రుతుపవనాలు మరీ నెమ్మదిక సాగుతున్నాయని, దీని వల్ల మరో 4 రోజులు ఆశించిన మేర వానలు లేకపోవచ్చని స్కైమెట్ తేల్చి చెప్పింది.