Loading...
Indian Railways Warning: రైళ్లలో లౌడ్ స్పీకర్‌లో పాటలు, వీడియోలు చూస్తే జరిమానా.. రైల్వే హెచ్చరిక
రైళ్లలో లౌడ్ స్పీకర్‌లో పాటలు, వీడియోలు చూస్తే జరిమానా.. రైల్వే హెచ్చరిక

Indian Railways Warning: రైళ్లలో లౌడ్ స్పీకర్‌లో పాటలు, వీడియోలు చూస్తే జరిమానా.. రైల్వే హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 19, 2026
04:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

రైళ్లలో లౌడ్ స్పీకర్‌తో పాటలు వినడం, వీడియోలు చూడటం వంటి చర్యలతో తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని దక్షిణ రైల్వే హెచ్చరించింది. రైళ్లలోనే కాకుండా రైల్వే స్టేషన్లలోనూ ఫోన్లను స్పీకర్ మోడ్‌లో ఉపయోగిస్తూ ఇతరులకు అసౌకర్యం కలిగించే వారిపై చర్యలు తీసుకోనున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.1,000 వరకు జరిమానా విధించడంతో పాటు రైలు లేదా రైల్వే ప్రాంగణం నుంచి బయటకు పంపించే అవకాశం ఉంది. ఇదే తప్పును పదేపదే చేస్తే గరిష్ఠంగా ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.5,000 వరకు జరిమానా ఎదుర్కోవాల్సి వస్తుంది.

వివరాలు 

జన్ విశ్వాస్ చట్టం కింద చర్యలు

బహిరంగ ప్రదేశాల్లో ఇతరులకు ఇబ్బంది కలిగించే చర్యలను నియంత్రించేందుకు 'జన్ విశ్వాస్ చట్టం' కింద సవరించిన రైల్వే చట్టంలోని సెక్షన్ 142ను దక్షిణ రైల్వే అమలు చేస్తోంది.

ప్రయాణికుల సౌకర్యానికి భంగం కలిగించే ప్రవర్తనను అరికట్టేందుకు ఇతర రైల్వే జోన్లు, మెట్రో వ్యవస్థలు కూడా ఈ నిబంధనలను ఉపయోగించుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

నిబంధనల ప్రకారం, మెట్రో రైళ్లలోనూ ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే వారిపై జరిమానా విధించడంతో పాటు కోచ్‌ల నుంచి బయటకు పంపించే అధికారం ఉంటుంది.

వివరాలు 

పబ్లిక్ న్యూసెన్స్‌గా పరిగణన

భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 270 ప్రకారం.. బహిరంగ ప్రదేశాలను ఉపయోగించే ప్రజలకు ఇబ్బంది, ప్రమాదం, అడ్డంకి లేదా అసౌకర్యం కలిగించే చర్యలను ప్రజా ఉపద్రవం (పబ్లిక్ న్యూసెన్స్) కింద నేరంగా పరిగణిస్తారు.

రైల్వే స్టేషన్లు, రైళ్లలో మొబైల్ ఫోన్ల స్పీకర్ల ద్వారా పాటలు, ఇతర ఆడియోలను వినిపించడం కూడా ఈ సమస్యలో భాగమేనని దక్షిణ రైల్వే పేర్కొంది.

ఈ అంశంపై ఈ నెలలో తన పరిధిలోని అన్ని డివిజన్లతో పాటు రైల్వే బోర్డుకు సర్క్యులర్ జారీ చేసింది.

ADVERTISEMENT

వివరాలు 

గతంలోనే మొబైల్ వినియోగంపై సూచనలు

మొబైల్ ఫోన్ల వినియోగానికి సంబంధించి 2012 జులైలో రైల్వే బోర్డు జారీ చేసిన నివేదికను కూడా తాజా సర్క్యులర్‌లో ప్రస్తావించారు.

రైలు కోచ్‌లలో గట్టిగా మాట్లాడటం, ఎక్కువసేపు ఫోన్‌లో సంభాషణలు కొనసాగించడం, ఇతరులకు ఇబ్బంది కలిగించేలా రింగ్‌టోన్లు వినిపించడం వంటి సమస్యలను బోర్డు అప్పట్లోనే గుర్తించింది.

ఇలాంటి ప్రవర్తన వల్ల తోటి ప్రయాణికులకు కలిగే అసౌకర్యంపై అవగాహన పెంచాలని అన్ని రైల్వే జోన్లకు సూచించింది.

ADVERTISEMENT

వివరాలు 

ప్రయాణికులకు అవగాహన కార్యక్రమాలు

మొబైల్ ఇంటర్నెట్ సౌకర్యం విస్తృతంగా అందుబాటులోకి రావడంతో బహిరంగ ప్రదేశాల్లో స్పీకర్ మోడ్‌లో వీడియోలు,ఇతర కంటెంట్‌ను ప్లే చేసే వారి సంఖ్య పెరిగిందని దక్షిణ రైల్వే తెలిపింది.

ఈ పరిస్థితుల్లో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారిక ప్రకటనలో పేర్కొంది.

ప్రయాణ సమయంలో లేదా రైల్వే ప్రాంగణాల్లో ఉన్నప్పుడు స్పీకర్ మోడ్‌లో పాటలు,వీడియోలు ప్లే చేయకుండా,గట్టిగా మాట్లాడకుండా ప్రయాణికులకు అవగాహన కల్పించాలని అన్ని డివిజన్లను ఆదేశించింది.

ఇందుకోసం ప్రాంతీయ భాషలు, హిందీ, ఇంగ్లిష్‌లో మైకుల ద్వారా ప్రకటనలు చేయనున్నారు.

నిబంధనలు ఉల్లంఘించే ప్రయాణికులకు టికెట్ తనిఖీ సిబ్బంది (టీటీఈ), కమర్షియల్ డివిజన్‌లోని సీనియర్ అధికారులు రూ.1,000 వరకు జరిమానా విధించవచ్చని దక్షిణ రైల్వే స్పష్టం చేసింది.

ADVERTISEMENT