IMD: నైరుతి రుతుపవనాలపై వాతావరణశాఖ కీలక అంచనా.. తెలంగాణలో వర్షాలు ఎప్పుడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ వ్యాప్తంగా భానుడి తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో వాతావరణ శాఖ ఊరటనిచ్చే సమాచారం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు గురువారం కేరళ తీరాన్ని తాకేందుకు అనుకూల పరిస్థితులు నెలకొన్నట్లు అధికారులు అంచనా వేశారు. కేరళలోకి ప్రవేశించిన తర్వాత సుమారు వారం రోజుల్లో అవి తెలంగాణకు చేరుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, ద్రోణుల ప్రభావంతో నేడు, రేపు, ఎల్లుండి పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
వివరాలు
ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్,జగిత్యాల,రాజన్న సిరిసిల్ల,నల్గొండ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే ఈరోజు సాయంత్రం 7 గంటల వరకు నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇక ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలతో పాటు యాదాద్రి భువనగిరి, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. బుధవారం ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంటూ ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు.
వివరాలు
రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు పడిపోనున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు
అదేవిధంగా ఉమ్మడి నల్గొండ, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలతో పాటు కామారెడ్డి జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో ప్రస్తుతం నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలు రాబోయే నాలుగు రోజుల్లో క్రమంగా తగ్గే అవకాశముందని, గరిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు పడిపోవచ్చని వాతావరణశాఖ వెల్లడించింది.