
Saraswathi Pushkaralu: సరస్వతి నది పుష్కరాలకు విజయవాడ నుంచి ప్రత్యేక బస్సులు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న కాళేశ్వరం తీర్థక్షేత్రం త్రివేణి సంగమంలో ఈ రోజు నుంచి సరస్వతి నది పుష్కరాల మహోత్సవం ప్రారంభమైంది.
గోదావరి, ప్రాణహిత నదులకు తోడు అంతర్వాహినిగా చేరే సరస్వతి నది ఈ ప్రదేశంలో త్రివేణి సంగమంగా ప్రసిద్ధి పొందింది.
ఈ విశిష్ట సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 26 వరకు పుష్కరాల ఉత్సవాలు జరుగనున్నాయి.
బృహస్పతి గ్రహం (గురుడు) మిథున రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈసారి సరస్వతి నదికి పుష్కర కాలం వచ్చింది.
బుధవారం రాత్రి 10.35 గంటలకు గురుగ్రహం మిథున రాశిలోకి ప్రవేశించినప్పటికీ, పుష్కర స్నానాలు మాత్రం గురువారం ఉదయం సూర్యోదయానికే ప్రారంభించాలంటూ కాళేశ్వరం ఆలయ అర్చకులు తెలిపారు.
వివరాలు
విజయవాడ నుంచి ప్రత్యేక బస్సు సదుపాయం
ఈ పుష్కరాల నేపథ్యంలో భక్తుల సౌలభ్యం కోసం విజయవాడ నుంచి కాళేశ్వరం త్రివేణి సంగమ యాత్రకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రజారవాణా శాఖ అధికారి ఎం.వై. దానం బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఈ యాత్రకు సంబంధించి టికెట్ ధరలు కూడా ప్రకటించారు. సూపర్ లగ్జరీ బస్సులో ప్రయాణానికి రూ.1999 కాగా, ఇంద్ర ఏసీ బస్సు టికెట్ ధర రూ.2599గా నిర్ణయించారు.
ఈ ఛార్జీలు కేవలం బస్సు ప్రయాణానికి మాత్రమే వర్తిస్తాయని, భోజనం,ఇతర వసతుల బాధ్యత భక్తులదేనని ఆయన స్పష్టం చేశారు.
ఆర్టీసీ అధీకృత టికెట్ బుకింగ్ ఏజెంట్ల వద్ద లేదా apsrtconline.in వెబ్‌సైట్ ద్వారా భక్తులు తమ సీట్లు ముందుగానే బుక్ చేసుకోవచ్చని సూచించారు.
వివరాలు
యాత్ర వివరాలు
ఈ బస్సులు మే 16వ తేదీ రాత్రి 10 గంటలకు విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి బయలుదేరతాయి.
మార్గమధ్యంగా ఖమ్మం,వరంగల్,భూపాలపల్లి మీదుగా ప్రయాణించి మరుసటి రోజు ఉదయం 5 గంటల సమయంలో కాళేశ్వరం చేరుకుంటాయి.
భక్తులు కాళేశ్వరం త్రివేణి సంగమంలో పుష్కర స్నానాలు ఆచరించిన తర్వాత,ముక్తేశ్వర స్వామిని దర్శించగలుగుతారు.
అనంతరం ధర్మపురిలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం,కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం, వేములవాడ రాజన్న ఆలయాలను దర్శించుకొని అక్కడే రాత్రి బస చేయాల్సి ఉంటుంది.
వివరాలు
యాత్ర వివరాలు
మూడో రోజు ఉదయం వరంగల్ నగరంలోని ప్రసిద్ధి గాంచిన భద్రకాళి అమ్మవారి దేవాలయం, వేయి స్తంభాల గుడి, యునెస్కో వారసత్వ కట్టడమైన రామప్ప దేవాలయాలను సందర్శించిన అనంతరం నాలుగో రోజు ఉదయం విజయవాడకు తిరిగి చేరుతారు.
పుష్కర యాత్రకు సంబంధించి మరింత సమాచారం కోసం 80742 98487 లేదా 93903 98475 నంబర్లకు సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.