Loading...
YS Jagan: 5.56 లక్షల మంది విద్యార్థులు తగ్గారు.. ఏపీలో ప్రభుత్వ బడులపై జగన్‌ సంచలన వ్యాఖ్యలు!
5.56 లక్షల మంది విద్యార్థులు తగ్గారు.. ఏపీలో ప్రభుత్వ బడులపై జగన్‌ సంచలన వ్యాఖ్యలు!

YS Jagan: 5.56 లక్షల మంది విద్యార్థులు తగ్గారు.. ఏపీలో ప్రభుత్వ బడులపై జగన్‌ సంచలన వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 23, 2026
03:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై వైసీపీ అధినేత జగన్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థులు భారీగా తగ్గిపోతున్నారని, అయినప్పటికీ కూటమి ప్రభుత్వం అబద్ధపు ప్రచారాలు చేసుకుంటోందని విమర్శించారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖకు చెందిన యూడైస్‌ ప్లస్‌ (UDISE+) గణాంకాలను ప్రస్తావిస్తూ సోషల్‌ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటు పాఠశాలల నుంచి 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని ప్రచారం చేసుకోవడంపై జగన్‌ మండిపడ్డారు. అదే నిజమైతే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి కదా? అని ప్రశ్నించారు.

వివరాలు

ప్రభుత్వ పాఠశాలలో తగ్గుతున్నారు

అయితే యూడైస్‌ గణాంకాల ప్రకారం 2023-24 విద్యా సంవత్సరంతో పోలిస్తే 2025-26 నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 40,50,116 నుంచి 34,93,450కి తగ్గిపోయిందని జగన్‌ పేర్కొన్నారు.

అంటే రెండేళ్లలో ఏకంగా 5,56,666 మంది విద్యార్థులు తగ్గిపోయారని తెలిపారు.

అదే సమయంలో ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 45,53,380 నుంచి 48,40,296కు పెరిగిందని వివరించారు.

ప్రభుత్వ పాఠశాలల సంఖ్య కూడా 45 వేల నుంచి 44,222కు తగ్గిందని జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

వివరాలు

ప్రైవేటు విద్యా సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకేనా?

టీడీపీకి నారాయణ, శ్రీచైతన్య వంటి కార్పొరేట్‌ విద్యా సంస్థలతో ఉన్న సంబంధాల కారణంగానే ప్రభుత్వ విద్యా వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా బలహీనపరుస్తున్నారని జగన్‌ ఆరోపించారు.

ప్రైవేటు విద్యా సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకే చంద్రబాబు ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు.

తమ ప్రభుత్వ హయాంలో విద్యా రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని జగన్‌ గుర్తుచేశారు. 'మనబడి నాడు-నేడు' కార్యక్రమం కింద రూ.8,524 కోట్లతో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపారు.

విద్యార్థులకు బైజూస్‌ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లు అందించడంతోపాటు ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్స్‌, స్మార్ట్‌ టీవీలను ఏర్పాటు చేశామని వివరించారు.

ADVERTISEMENT

వివరాలు

కూటమి ప్రభుత్వంలో విద్యారంగం తిరోగమనంలో ఉంది

ఆంగ్ల మాధ్యమాన్ని ప్రోత్సహించడంతోపాటు టోఫెల్‌ వంటి అంతర్జాతీయ స్థాయి శిక్షణకు కూడా శ్రీకారం చుట్టామని జగన్‌ పేర్కొన్నారు.

అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ విద్యా రంగం తిరోగమనంలో పయనిస్తుండటం ఆందోళనకరమని అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు సంబంధించిన గణాంకాలే కూటమి ప్రభుత్వ ప్రచారంలోని డొల్లతనాన్ని బయటపెడుతున్నాయని జగన్‌ విమర్శించారు.

ADVERTISEMENT