Dowry Deaths: భారత్‌లో వరకట్న మరణాలపై తగ్గుతున్న ప్రజా ఆగ్రహం.. అధ్యయనంలో ఆందోళనకర విషయాలు
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌లో వరకట్నం పేరుతో మహిళల మరణాలు ఇప్పటికీ వేల సంఖ్యలో జరుగుతున్నప్పటికీ, గతంలో కనిపించిన స్థాయిలో ప్రజా ఆగ్రహం, రాజకీయ చర్చలు, ఉద్యమాలు కనిపించడం లేదని తాజా అధ్యయనం వెల్లడించింది. వరకట్న వివాదాల కారణంగా హత్యలకు గురవడం లేదా ఆత్మహత్యలకు బలవుతున్న మహిళల ఘటనలు కొనసాగుతున్నా, సమాజంలో వాటిపై స్పందన క్రమంగా తగ్గిపోయిందని పరిశోధకులు పేర్కొన్నారు. అధ్యయనం ప్రకారం, 1988లో దేశంలో 1,841 కట్న మరణాలు నమోదవగా, 2022 నాటికి ఆ సంఖ్య 6,516కు చేరింది. కేసులు పెరుగుతున్నప్పటికీ, వాటిపై గతంలా పెద్ద ఎత్తున నిరసనలు లేదా ప్రజా ఉద్యమాలు కనిపించడం లేదని నివేదిక తెలిపింది.
వివరాలు
ప్రపంచవ్యాప్తంగా నిరసన ఉద్యమాలు నిర్వహించడం మరింత కష్టంగా మారింది
గత ఏడాది ఆగస్టులో ఢిల్లీ సమీపంలోని గ్రేటర్ నోయిడాకు చెందిన 28ఏళ్ల నిక్కీ భాటి కట్నవేధింపుల నేపథ్యంలో భర్త ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో మృతి చెందింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఆమె ఆరేళ్ల కుమారుడి ఎదుటే ఈ దారుణం జరగగా,ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొంతకాలం నిరసనలు వెల్లువెత్తాయి. ఢిల్లీలో నిరసనలు కూడా జరిగాయి. అయితే కొద్ది రోజుల్లోనే ఆ అంశంపై చర్చలు తగ్గిపోయాయని అధ్యయనం గుర్తు చేసింది. ఈ పరిశోధన రచయిత్రి, లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌కు చెందిన కింగ్స్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ సామాజిక మానవ శాస్త్రవేత్త డాక్టర్ కృతి కపిలా మాట్లాడుతూ,ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నిరసన ఉద్యమాలు నిర్వహించడం మరింత కష్టంగా మారిందన్నారు.
వివరాలు
కట్న డిమాండ్లు ఇప్పటికీ కొనసాగుతున్నాయి
భారత్‌తో పాటు అనేక దేశాల్లో నిరసనలను కట్టడి చేసే పరిస్థితులు పెరిగాయని, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంపై కూడా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పరిమితులు ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. భారత్‌లో 1961లోనే కట్నాన్ని చట్టపరంగా నిషేధించినప్పటికీ, వరుడి కుటుంబం నుంచి కట్న డిమాండ్లు ఇప్పటికీ కొనసాగుతున్నాయని అధ్యయనం తెలిపింది. కట్నం ఇవ్వలేకపోతే మహిళలు వేధింపులు, మానసిక హింస, శారీరక దాడులు, చివరకు హత్యలకు కూడా గురవుతున్నారని పేర్కొంది. కుల వ్యవస్థను బలహీనపర్చేందుకు తీసుకొచ్చిన చట్టపరమైన సంస్కరణలు కట్నం రూపాన్ని మార్చినా, దానికి ఆధారమైన సామాజిక నిర్మాణాలను మాత్రం పూర్తిగా తొలగించలేకపోయాయని పరిశోధన వెల్లడించింది.
వివరాలు
వరుడి విలువను ఆర్థిక ప్రయోజనాలతో ముడిపెట్టే పరిస్థితి
ఒకప్పుడు వరుడి కుటుంబానికి ఇచ్చే సంప్రదాయ కానుకగా ఉన్న కట్నం, కాలక్రమంలో వరుడి కులం, ఆర్థిక స్థితి, విద్య, ఉద్యోగం ఆధారంగా భారీ మొత్తాలు డిమాండ్ చేసే విధానంగా మారిందని డాక్టర్ కపిలా వివరించారు. వరుడి విలువను ఆర్థిక ప్రయోజనాలతో ముడిపెట్టే పరిస్థితి ఏర్పడిందని, వధువు కుటుంబం పెరుగుతున్న డిమాండ్లను తీర్చలేకపోతే ఆమెపై శారీరక, మానసిక హింసకు పాల్పడుతున్న ఘటనలు పెరిగాయని అధ్యయనం పేర్కొంది. కట్న నిరోధక చట్టం ఎందుకు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదన్నదే అసలు ప్రశ్న కాదని, వరకట్న హత్యలు ఒకప్పుడు వేలాది మంది మహిళలను వీధుల్లోకి తీసుకొచ్చినంత తీవ్ర సామూహిక ఆవేదనను ఇప్పుడు ఎందుకు రేకెత్తించడం లేదన్నదే ప్రధాన ప్రశ్న అని డాక్టర్ కపిలా వ్యాఖ్యానించారు.
వివరాలు
970, 1980 దశకాల్లో కట్న హింసకు వ్యతిరేకంగా మహిళా ఉద్యమాలు
ఈ మార్పు యాదృచ్ఛికం కాదని, దాని వెనుక సామాజిక నిర్మాణమే కారణమని ఆమె అన్నారు. 1970, 1980 దశకాల్లో కట్న హింసకు వ్యతిరేకంగా మహిళా ఉద్యమాలు దేశవ్యాప్తంగా బలంగా సాగాయి. అప్పట్లో కిరోసిన్‌తో వంటగది ప్రమాదాలుగా చిత్రీకరించి కోడళ్లను హత్య చేసే ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వచ్చేవి. దీంతో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయని అధ్యయనం గుర్తు చేసింది. 1990 తర్వాత ఇళ్లలో కిరోసిన్ వినియోగం తగ్గడంతో,"వంటగదిలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి"అనే వాదనను నమ్మించడం కష్టంగా మారిందని అధ్యయనం పేర్కొంది. దాంతో వేధింపులకు గురైన మహిళలను ఆత్మహత్యలకు ప్రేరేపించే ఘటనలు పెరిగాయని పరిశోధన తెలిపింది. దీంతో ఒకప్పుడు ప్రజా ఆగ్రహంగా మారిన అంశం,ఇప్పుడు కుటుంబాల వ్యక్తిగత విషాదంగా మాత్రమే మిగిలిపోతోందని అధ్యయనం విశ్లేషించింది.
వివరాలు
వెయ్యి మంది అబ్బాయిలకు దేశవ్యాప్తంగా సగటున 927 మంది అమ్మాయిలే..
భవిష్యత్తులో వరకట్న భారం తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఆడ శిశువు పుడుతుందని తెలిసిన తర్వాత గర్భస్రావాలు చేసే ఘటనలు కూడా పెరిగినట్లు అధ్యయనం పేర్కొంది. 2001 జనగణనలో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు దేశవ్యాప్తంగా సగటున 927 మంది అమ్మాయిలే నమోదయ్యారని, పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈ సంఖ్య 754కు పడిపోయిందని అధ్యయనం గుర్తుచేసింది.
వివరాలు
కట్నం ప్రధాన అంశంగా మారడం లేదు
కుటుంబాల లోపలే జరిగే ఈ తరహా హింస కారణంగా సమాజం మొత్తం కలిసి నిరసన వ్యక్తం చేసే పరిస్థితి తగ్గిపోయిందని డాక్టర్ కపిలా అభిప్రాయపడ్డారు. కట్నం ఇప్పటికీ కొనసాగుతూనే ఉండి, అనేక మంది మహిళల ప్రాణాలు తీస్తున్నప్పటికీ, అది ఇక రాజకీయ చర్చల్లోనూ, ప్రజా ఉద్యమాల్లోనూ ప్రధాన అంశంగా మారడం లేదని ఆమె పేర్కొన్నారు. అయినప్పటికీ భవిష్యత్తులో మహిళలు కట్న మరణాలకు వ్యతిరేకంగా కొత్త రూపాల్లో తమ నిరసనను వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు.