Manmohan Singh : బొగ్గు గనుల కేటాయింపు కేసులో మాజీ ప్రధానికి క్లీన్ చిట్.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఈ వార్తాకథనం ఏంటి
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై నమోదైన బొగ్గు గనుల కేటాయింపు క్రిమినల్ కేసుకు సుప్రీంకోర్టు శాశ్వతంగా తెరదించింది. ప్రత్యేక కోర్టు గతంలో జారీ చేసిన సమన్ల ఉత్తర్వులను రద్దు చేస్తూ, కేసును పూర్తిగా మూసివేస్తున్నట్లు దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. మన్మోహన్ సింగ్‌తో పాటు ఇతర నిందితులకు విచారణ సంస్థ సమర్పించిన క్లోజర్ రిపోర్టులను ధర్మాసనం ఆమోదించింది. సీబీఐ దాఖలు చేసిన క్లోజర్ నివేదికలను తిరస్కరించి ట్రయల్ కోర్టు సమన్లు జారీ చేయడం సమంజసం కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
వివరాలు
తలబిరా-II బొగ్గు గని కేటాయింపు కేసు ఏమిటి?
ధర్మాసనం తన తీర్పులో, విచారణ సంస్థలు సమర్పించే క్లోజర్ నివేదికల స్వీకరణపై గతంలో సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పరిశీలిస్తే, సీబీఐ నివేదికలను తిరస్కరించి కేసును విచారణకు స్వీకరించేందుకు ప్రత్యేక కోర్టు వద్ద బలమైన కారణాలు లేవని పేర్కొంది.
అందువల్ల అప్పీల్‌ను అనుమతిస్తూ కేసును పూర్తిగా క్లోజ్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది.
2005లో ఒడిశాలోని తలబిరా-II (Talabira-II) బొగ్గు బ్లాక్ కేటాయింపుల వ్యవహారంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి.
ఈ కేసులో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా, మాజీ బొగ్గు శాఖ కార్యదర్శి పి.సి. పరాఖ్‌తో పాటు మరో ముగ్గురిని నిందితులుగా పేర్కొంటూ ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది.
వివరాలు
సమన్ల అమలుపై స్టే విధించిన సుప్రీంకోర్టు
అయితే, ఆ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు వెంటనే జోక్యం చేసుకుని సమన్ల అమలుపై స్టే విధించింది.
ప్రధానమంత్రిగా, ప్రజాసేవకుడిగా విధి నిర్వహణలో తీసుకున్న నిర్ణయాలపై చట్టపరమైన అనుమతి లేకుండా క్రిమినల్ విచారణ చేపట్టడం సరికాదని అప్పట్లో అభిప్రాయపడింది.
ఈ కేటాయింపుల ప్రక్రియలో ఎలాంటి నేరపూరిత ఉద్దేశం లేదని మన్మోహన్ సింగ్ అప్పటికే సుప్రీంకోర్టుకు తెలియజేశారు.
అనంతరం సుదీర్ఘకాలం కొనసాగిన విచారణలో సీబీఐ రెండుసార్లు క్లోజర్ రిపోర్టులు సమర్పించింది.
చివరకు ఆ నివేదికలను సుప్రీంకోర్టు ఆమోదించి, కేసును శాశ్వతంగా మూసివేయడంతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ఉన్న ప్రధాన ఆరోపణలు పూర్తిగా తొలగిపోయాయి.