Supreme Court: తెలంగాణ అసెంబ్లీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీం నోటీసులు!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ, రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘంలకు నోటీసులు పంపింది.
మార్చి 22లోగా ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను మార్చి 25కి వాయిదా వేసింది.
ఈ కేసును జస్టిస్ బి.ఆర్. గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం పరిశీలించగా, జస్టిస్ బి.ఆర్. గవాయి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
రీజనబుల్ టైమ్ అంటే గడువు ముగిసే వరకు అనడమా? ప్రజాస్వామ్య విధానాలకు సరైన సమయం అవసరం.
ఎంత సమయం కావాలో చెప్పండి. ఆపరేషన్ సక్సెస్, పేషంట్ డెడ్ అనే తీరు సరికాదని వ్యాఖ్యానించారు.
Details
సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ తరఫున వాదనలు
బీఆర్ఎస్ తరఫున సీనియర్ న్యాయవాది ఆర్యామ సుందరం వాదనలు వినిపించారు.
ఆయన తన వాదనలో, గతేడాది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఫిరాయించారని స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని, ఆ తర్వాత హైకోర్టులో విచారణ జరిగిందన్నారు.
సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ రివర్స్ చేసిందని, అది జరిగి ఏడాది పూర్తయిందని పేర్కొన్నారు.
అలాగే అనర్హతపై నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేయడం ఒక ఎత్తుగడగా మారిందన్నారు.
న్యాయపరమైన సత్వర పరిష్కారం కోసం సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. సుప్రీంకోర్టు జారీ చేసిన నోటీసులు, చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.