
Supreme Court: విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు 'నేషనల్ టాస్క్‌ఫోర్స్' ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
విద్యాసంస్థల్లో విద్యార్థులు తరచుగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ఇటీవల ఐఐటీ-దిల్లీలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో, ఈ ఘటనల వెనుక ఉన్న కారణాలను నిర్ధారించేందుకు విచారణ చేపట్టాలని జస్టిస్ జె.బి. పార్దివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
అంతేకాకుండా, ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి, ఆత్మహత్యలను నివారించేందుకు 'జాతీయ టాస్క్‌ఫోర్స్'ను ఏర్పాటు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.
వివరాలు
సామాజిక సంస్థల సహకారంతో అవగాహన కార్యక్రమాలు
''విద్యార్థుల భద్రత, శ్రేయస్సు కోసం తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి విద్యాసంస్థపై ఉంది. క్యాంపస్ పరిధిలో ఆత్మహత్య వంటి దురదృష్టకర సంఘటన జరిగిన వెంటనే యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించి, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించాలి. ఇది వారి ప్రాథమిక విధిగా భావించాలి. పోలీసులు కూడా వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి'' అని ధర్మాసనం స్పష్టం చేసింది.
విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా, మానసిక కుంగుబాటుకు లోనవకుండా వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, సామాజిక సంస్థల సహకారంతో వీటిని అమలు చేయాలని సూచించింది.
ఇటీవల విద్యార్థుల్లో ఒత్తిడి తీవ్రమవుతున్న నేపథ్యంలో, వారు తమ సమస్యలను ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడుతోందని కోర్టు అభిప్రాయపడింది.
వివరాలు
'జాతీయ టాస్క్‌ఫోర్స్'కు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వం
ఇది ఆత్మహత్యలకు దారితీసే అంతర్గత కారణాలను అరికట్టేందుకు సముచిత మార్గదర్శకాలు రూపొందించాల్సిన సమయం వచ్చిందని పేర్కొంది.
ఈ సమస్యను పరిష్కరించేందుకు, ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచేందుకు 'జాతీయ టాస్క్‌ఫోర్స్'ను ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది.
ఈ విభాగానికి సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్. రవీంద్ర భట్ నేతృత్వం వహించనున్నారని పేర్కొంది.
దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని విద్యాశాఖ ఉన్నతాధికారులను ఇందులో భాగం చేసేందుకు అధికారులను ఆదేశించింది.