Supreme Court: ఎమ్మెల్యే ఫిరాయింపుల కేసులో తెలంగాణ స్పీకర్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం..
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ స్పీకర్‌పై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం మీరు తీసుకుంటారా? లేక మేమే తీసుకోవాలా? అని వ్యాఖ్యానిస్తూ స్పీకర్‌ను నేరుగా ప్రశ్నించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుల్లో తీర్పు ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నారనే ఆరోపణలపై దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, ఈ విషయంపై తెలంగాణ స్పీకర్‌కు నోటీసులు కూడా జారీ చేసింది.
వివరాలు
నాలుగు వారాల్లో విచారణను పూర్తి చేస్తామని హామీ
ఫిరాయింపు కేసులకు సంబంధించి మూడు నెలల్లో నిర్ణయం ఇవ్వకపోవడంతో కేటీఆర్ కోర్టు ధిక్కార పిటిషన్ వేశారని తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆ ధిక్కార అంశంపై స్పీకర్ నాలుగు వారాల లోపు సమాధానం ఇవ్వాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం చేపట్టింది. "మూడు నెలల గడువు గడిచిపోయినా నిర్ణయం ఇవ్వకపోవడం కోర్టు ఆదేశాల ధిక్కారమే. మీరు ప్రతిరోజూ విచారణ జరిపి త్వరగా నిర్ణయానికి రావాలి" అని జస్టిస్ గవాయి హెచ్చరించారు. దీనికి ప్రతిస్పందించిన స్పీకర్ తరఫు న్యాయవాదులు అభిషేక్ సింగ్, ముకుల్ రోహత్గి- నాలుగు వారాల్లో విచారణను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.