Supreme Court: అయోధ్య రామాలయ విరాళాల కేసు: జూలై 13న సుప్రీంకోర్టులో కీలక విచారణ
ఈ వార్తాకథనం ఏంటి
అయోధ్యలోని శ్రీరామ మందిరంలో భక్తులు సమర్పించిన విరాళాల లెక్కింపులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు దేశ అత్యున్నత న్యాయస్థానం దృష్టికి చేరాయి. ఈ వ్యవహారంపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు జూలై 13న విచారించనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనంలో జస్టిస్ జాయ్‌మల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహన్ సభ్యులుగా ఈ కేసును పరిశీలించనున్నారు.
వివరాలు
పిటిషనర్ల ప్రధాన డిమాండ్లు
విరాళాల అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)తో స్వతంత్ర విచారణ జరపాలని నరేంద్ర కుమార్ గోస్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలాగే, అయోధ్య రామాలయ వ్యవహారాలను నిర్వహిస్తున్న శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆర్థిక లావాదేవీలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(సీఏజీ)ద్వారా ఆడిట్ చేయించాలని కోరారు. ఇదే అంశంపై అజయ్ కుమార్ రాయ్, దినేష్ కుమార్ యాదవ్ కూడా వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. మరోవైపు, ఆర్‌జేడీ ఎంపీ సుధాకర్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌లో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ట్రస్ట్ ఆర్థిక వ్యవహారాలపై సమగ్ర ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని, డిజిటల్ లెడ్జర్లు, యూపీఐ లావాదేవీల వివరాలు,బ్యాంకు స్టేట్‌మెంట్లు,ఇతర భౌతిక రికార్డులను భద్రపరచాలని కోర్టు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
వివరాలు
పిటిషనర్ల ప్రధాన డిమాండ్లు
అలాగే, ప్రతిపాదిత ఉన్నతస్థాయి ఓవర్‌సైట్ కమిటీ అనుమతి లేకుండా ట్రస్ట్ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం లేదా కీలక ఒప్పందాలు చేసుకోవడాన్ని నిలిపివేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. పారదర్శకత కోసం ట్రస్ట్ తన అధికారిక వెబ్‌సైట్‌లో ఆడిట్ నివేదికలు, విరాళాల వివరాలను అందుబాటులో ఉంచాలని కూడా విజ్ఞప్తి చేశారు. ట్రస్ట్ ఏర్పాటైన నాటి నుంచి నగదు, బ్యాంకు బదిలీలు, డిజిటల్ చెల్లింపులు, విదేశీ విరాళాలు, బంగారం, వెండి రూపంలో అందిన కానుకల పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
వివరాలు
వివాదానికి కారణమేంటి?
ఈ ఏడాది జూన్ తొలి వారంలో రామాలయం విరాళాల లెక్కింపులో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కేసును విడిగా విచారిస్తోంది. ప్రాథమిక దర్యాప్తులో దుర్వినియోగం చేసిన డబ్బులో కొంత భాగాన్ని నిందితులు షేర్ మార్కెట్‌లో పెట్టుబడులుగా పెట్టినట్లు, మరికొంత మొత్తాన్ని వడ్డీ వ్యాపారాలకు వినియోగించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అదేవిధంగా, కొంత నిధిని బంధువులు, సన్నిహితుల బ్యాంకు ఖాతాలకు మళ్లించినట్లు గుర్తించారు.
వివరాలు
సీసీటీవీ ఫుటేజీలో వెలుగుచూసిన అంశాలు
విరాళాల లెక్కింపు గదిలో భద్రతా లోపాలు తీవ్రంగా ఉన్నట్లు సిట్ విచారణలో బయటపడింది. లెక్కింపు సిబ్బంది నగదు కట్టలను దుస్తులు,జేబులు,షూల్లో దాచుకుని బయటకు తీసుకెళ్లినట్లు సీసీటీవీ దృశ్యాలు వెల్లడించాయి. ఇది ఒక్కరోజు జరిగిన ఘటన కాదని,చాలా కాలంగా ఇదే తరహాలో కొనసాగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఏప్రిల్ 27 నుంచి జూన్ 5 వరకు నమోదైన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా సుమారు 70 అనుమానాస్పద ఘటనలు గుర్తించినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. సిబ్బంది లెక్కింపు హాల్‌లోకి ప్రవేశించే సమయంలో, బయటకు వచ్చే సమయంలో సరైన తనిఖీలు లేకపోవడం వల్లే ఈ దొంగతనాలకు అవకాశం ఏర్పడినట్లు సిట్ నివేదిక స్పష్టం చేసింది.
వివరాలు
అరెస్టులు.. రాజీనామాలు
అంతేకాదు, నిందితులు నకిలీ రసీదులు రూపొందించి భక్తుల నుంచి విరాళాలు సేకరించినట్లు జూలై 8న జరిగిన పోలీసు విచారణలో బయటపడింది. ఈ కేసులో ఇప్పటివరకు ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు సభ్యులతో కూడిన సిట్ సమర్పించిన ప్రాథమిక నివేదిక ప్రకారం అవినాష్ శుక్లా ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు పేర్కొన్నారు. సుమారు 40 రోజుల పాటు సాగిన అక్రమాలకు అతడి పాత్ర ఉన్నట్లు ఆధారాలు లభించినట్లు వెల్లడించారు. ఈ వివాదం అనంతరం రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామా చేశారు. అనంతరం ట్రస్ట్ సమావేశంలో వారి రాజీనామాలను ఆమోదించారు.
వివరాలు
అరెస్టులు.. రాజీనామాలు
చంపత్ రాయ్ రాజీనామా విషయంలో ఎలాంటి అసంతృప్తి లేదని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి స్పష్టం చేశారు. మరోవైపు, నిందితులైన అనుకల్ప్ మిశ్రా, లవ్‌కుష్ మిశ్రా, కరుణేష్ పాండేల బంధువులకు చెందిన 30 బ్యాంకు ఖాతాలను పోలీసులు స్తంభింపజేశారు. కోర్టు అనుమతితో ఈ ముగ్గురు నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. వారి ఇళ్లలో నిర్వహించిన సోదాల్లో భారీ మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలు, ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వివరాలు
ట్రస్ట్‌కు సీఎం యోగి మద్దతు
విరాళాల వ్యవహారంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్రస్ట్‌కు మద్దతుగా నిలిచారు. విరాళాల లెక్కింపులో సుమారు 150 మంది సిబ్బంది పాల్గొన్నప్పటికీ, సిట్ దర్యాప్తులో కేవలం ఎనిమిది మందిపై మాత్రమే ఆధారాలు లభించాయని ఆయన పేర్కొన్నారు. అయోధ్యలో రూ.950 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విరాళాల లెక్కింపులో అక్రమాలు జరుగుతున్నట్లు ట్రస్ట్ స్వయంగా ప్రభుత్వానికి సమాచారం ఇచ్చి, ఉన్నతస్థాయి సిట్ దర్యాప్తును కోరిందని యోగి తెలిపారు.
వివరాలు
ట్రస్ట్‌కు సీఎం యోగి మద్దతు
ప్రభుత్వంగా వెంటనే దర్యాప్తుకు ఆమోదం తెలిపామని చెప్పారు. విచారణలో ఆరుగురు నేరుగా దొంగతనానికి పాల్పడగా, మరో ఇద్దరు కుట్రలో భాగమైనట్లు తేలిందన్నారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్న సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసం మొత్తం ట్రస్ట్‌ను, అయోధ్యను విమర్శించడం సమంజసం కాదని యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. శ్రీరాముడిపై విశ్వాసం ఉన్నవారు, భారతీయ సంస్కృతిని గౌరవించే ప్రతి ఒక్కరూ ఇలాంటి విమర్శలను అప్రమత్తంగా పరిశీలించాలని ఆయన పిలుపునిచ్చారు.