Supreme Court: సహజీవన బంధాల్లో వేధింపులకూ 498ఏ వర్తింపు: సుప్రీంకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
వివాహిత మహిళలను భర్త లేదా అతని కుటుంబ సభ్యుల వేధింపుల నుంచి రక్షించేందుకు అమల్లో ఉన్న భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని 498ఏ సెక్షన్ పరిధిని సుప్రీంకోర్టు విస్తరించింది. పరస్పర అంగీకారంతో భార్యాభర్తల్లా కలిసి జీవిస్తున్న సహజీవన (లివ్-ఇన్) జంటలకూ ఈ చట్టం వర్తిస్తుందని సోమవారం స్పష్టం చేసింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది. వివాహ బంధాన్ని పోలి ఉండే సహజీవన సంబంధంలో మహిళను పురుషుడు వేధింపులకు గురిచేస్తే, అతనిపై ఐపీసీ 498ఏ కింద చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని పేర్కొంది.
వివరాలు
ఈ సెక్షన్ కింద నమోదయ్యే కేసుల్లో చట్టపరమైన నిబంధనలను కచ్చితంగా పాటించాలి: సుప్రీం
ఇప్పటివరకు ఈ సెక్షన్ ప్రధానంగా వివాహిత మహిళలను భర్త లేదా అతని బంధువుల క్రూర ప్రవర్తన నుంచి రక్షించడానికే పరిమితమైందని ధర్మాసనం గుర్తు చేసింది.
అయితే ప్రస్తుతం సమాజంలో సహజీవనం కూడా ఒక జీవన వాస్తవంగా మారిందని,ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఇలాంటి సంబంధాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆ బంధాల్లో ఉన్న మహిళలకు కూడా చట్టపరమైన రక్షణ అందాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.
అయితే ఈ సెక్షన్ కింద నమోదయ్యే కేసుల్లో చట్టపరమైన నిబంధనలను కచ్చితంగా పాటించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ముఖ్యంగా సహజీవన సంబంధాల్లో ఉన్న పురుషుడు లేదా అతని కుటుంబ సభ్యులను ప్రాథమిక విచారణ నిర్వహించకుండా నేరుగా అరెస్టు చేయకూడదని ఆదేశించింది.
వివరాలు
మహిళల హక్కులు, భద్రతకు కూడా సమాన ప్రాధాన్యం
అరెస్టుకు సంబంధించిన చట్టంలోని విధి విధానాలను తప్పనిసరిగా అనుసరించాలని సూచించింది.
సమాజంలో మారుతున్న జీవన విధానాలకు అనుగుణంగా చట్టాల అమలూ ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్న సుప్రీంకోర్టు, వివాహ బంధాన్ని పోలి ఉండే సహజీవన సంబంధాల్లో మహిళల హక్కులు, భద్రతకు కూడా సమాన ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉందని ఈ తీర్పులో స్పష్టం చేసింది.