Swachh Vayu Survekshan 2026: స్వచ్ఛ వాయు సర్వేక్షణ్-2026లో గుంటూరుకు జాతీయస్థాయిలో రెండో ర్యాంకు
ఈ వార్తాకథనం ఏంటి
స్వచ్ఛ వాయు సర్వేక్షణ్-2026లో గుంటూరు సత్తా చాటింది. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ ప్రకటించిన ఫలితాల్లో 3 లక్షల నుంచి 10 లక్షలలోపు జనాభా ఉన్న నగరాల విభాగంలో గుంటూరు జాతీయస్థాయిలో రెండో ర్యాంకు సాధించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌తో సమానంగా రెండో స్థానాన్ని పంచుకుంది. ఈ కేటగిరీకి ప్రకటించిన రూ.50 లక్షల నగదు బహుమతిలో గుంటూరుకు రూ.25 లక్షలు దక్కాయి. సోమవారం పర్యావరణభవన్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో గుంటూరు నగరపాలక సంస్థ ప్రతినిధులు పురస్కారాన్ని అందుకున్నారు. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఛైర్‌పర్సన్ జస్టిస్ ప్రకాశ్ శ్రీవాస్తవ, ఎయిర్‌క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ ఛైర్‌పర్సన్ రాజేష్‌వర్మ, కేంద్ర పర్యావరణ, అటవీశాఖ కార్యదర్శి తన్మయ్‌కుమార్, సీపీసీబీ ఛైర్మన్ అమన్‌దీప్‌గర్గ్ చేతుల మీదుగా ఈ అవార్డును స్వీకరించారు.
వివరాలు
130 నగరాల్లో వాయు నాణ్యతపై సర్వే
నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (ఎన్‌సీఏపీ) పరిధిలో దేశవ్యాప్తంగా 130 నగరాల వాయు నాణ్యత ప్రమాణాల ఆధారంగా ఈ సర్వే నిర్వహించారు.
జనాభా ఆధారంగా మూడు విభాగాలుగా నగరాలు, పట్టణాలకు ర్యాంకులు ప్రకటించారు.
10 లక్షలకుపైగా జనాభా ఉన్న 48 నగరాలు, 3 లక్షల నుంచి 10 లక్షలలోపు జనాభా ఉన్న 42 నగరాలు, 3 లక్షలలోపు జనాభా ఉన్న 40 పట్టణాలు ఈ సర్వేలో ఉన్నాయి.
విజయవాడకు 8వ ర్యాంకు
10 లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాల కేటగిరీలో విజయవాడ 8వ ర్యాంకు, విశాఖపట్నం 21వ ర్యాంకు సాధించాయి.
2025 ర్యాంకులతో పోలిస్తే విజయవాడ ఐదు స్థానాలు మెరుగుపరుచుకుంది. మరోవైపు విశాఖపట్నం నాలుగు స్థానాలు కోల్పోయింది.
వివరాలు
నాలుగు స్థానాలు మెరుగుపరుచుకున్న గుంటూరు
3 లక్షల నుంచి 10 లక్షలలోపు జనాభా ఉన్న నగరాల విభాగంలో గుంటూరు గతేడాదితో పోలిస్తే నాలుగు స్థానాలు మెరుగుపరుచుకొని రెండో ర్యాంకుకు చేరింది.
నెల్లూరు 18వ స్థానం నుంచి 9వ స్థానానికి, అనంతపురం 35వ స్థానం నుంచి 34వ స్థానానికి ఎదిగాయి.
కర్నూలు మాత్రం వరుసగా రెండో ఏడాదీ 29వ ర్యాంకులోనే కొనసాగింది.
ఇదే కేటగిరీలో రాజమహేంద్రవరం 12వ స్థానం నుంచి 14వ స్థానానికి, కడప 23వ స్థానం నుంచి 34వ స్థానానికి పడిపోయాయి.
వివరాలు
ఏలూరుకు భారీగా మెరుగైన ర్యాంకు
3 లక్షలలోపు జనాభా ఉన్న పట్టణాల విభాగంలో ఏలూరు అత్యంత మెరుగైన ప్రదర్శన కనబరిచింది.
గతంలో 31వ స్థానంలో ఉన్న ఏలూరు ఈసారి ఏకంగా నాలుగో ర్యాంకుకు చేరింది.
విజయనగరం 8వ స్థానం నుంచి 6వ స్థానానికి, శ్రీకాకుళం 16వస్థానం నుంచి 11వస్థానానికి, చిత్తూరు 29వ స్థానం నుంచి 26వ స్థానానికి మెరుగుపడ్డాయి.
అయితే ఒంగోలు ర్యాంకు మాత్రం తగ్గింది. గతంలో 21వస్థానంలో ఉన్న ఒంగోలు ఈసారి 25వ ర్యాంకుకు పడిపోయింది.
విజయవాడ 60వ వార్డుకు జాతీయస్థాయిలో రెండో ర్యాంకు
10 వేల నుంచి 30వేలలోపు జనాభా ఉన్న వార్డుల విభాగంలో విజయవాడ 60వ వార్డు జాతీయస్థాయిలో రెండో ర్యాంకు సాధించింది. దీంతో ఆ వార్డుకు రూ.30 లక్షల నగదు బహుమతి లభించింది.
వివరాలు
ఏపీ నుంచి 9 నగరాల ర్యాంకులు మెరుగుదల
మొత్తంగా నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ పరిధిలో రాష్ట్రానికి చెందిన 13 నగరాల పనితీరును పరిశీలిస్తే.. గతేడాదితో పోలిస్తే 9 నగరాలు తమ ర్యాంకులను మెరుగుపరుచుకున్నాయి. మరో నాలుగు నగరాలు మాత్రం ర్యాంకుల్లో వెనుకబడ్డాయి.
వివరాలు
రాష్ట్రస్థాయి వార్డుల ర్యాంకుల్లోనూ ఏపీకి పురస్కారాలు
రాష్ట్రస్థాయిలో వార్డుల పనితీరుకు సంబంధించి కూడా పలు నగరాలు మంచి ర్యాంకులు సాధించాయి.
30వేలకుపైగా జనాభా ఉన్న వార్డుల విభాగంలో గుంటూరు 42వ వార్డు మొదటి స్థానంలో నిలిచింది.
దీంతో ఆ వార్డుకు రూ.25 లక్షల నగదు బహుమతి దక్కింది. 10 వేల నుంచి 30 వేలలోపు జనాభా ఉన్న వార్డుల విభాగంలో విజయవాడ 31వ వార్డు మొదటి ర్యాంకు సాధించింది.
ఈ వార్డుకు రూ.15 లక్షల నగదు బహుమతి లభించింది. 10 వేలలోపు జనాభా ఉన్న వార్డుల విభాగంలో నెల్లూరు 6వ వార్డు తొలిస్థానంలో నిలిచి రూ.10 లక్షల బహుమతి గెలుచుకుంది.
మొత్తం 8 కేటగిరీల్లో నగరాలు, వార్డులు ప్రదర్శించిన పనితీరును పరిగణనలోకి తీసుకొని స్వచ్ఛ వాయు సర్వేక్షణ్-2026 ర్యాంకులను ప్రకటించారు.