Swine flu: తెలంగాణ రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ కేసుల కలకలం..
తెలంగాణలో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో విష జ్వరాలు కూడా విజృంభిస్తున్నాయి. నగరాలు, గ్రామాలు సైతం ఈ జ్వరాలతో అల్లాడుతున్నాయి. గతకొన్ని సంవత్సరాలుగా స్వైన్ ఫ్లూ కేసులు లేకపోయినప్పటికీ, తాజాగా నాలుగు కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నారాయణగూడలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (IPM) ఈ కేసులను ధృవీకరించింది. మాదాపూర్‌లో నివసిస్తున్న 23 ఏళ్ల పశ్చిమ బెంగాల్ యువకుడు తీవ్రమైన దగ్గుతో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా, వారు నమూనాలను IPMకి పంపించారు. నారాయణగూడ IPM స్వైన్ ఫ్లూని నిర్ధారించింది.
స్వైన్ ఫ్లూ ఇతర కేసులు
టోలీచౌకికి చెందిన 69 ఏళ్ల వృద్ధుడు, నిజామాబాద్ జిల్లా పిట్లం మండలానికి చెందిన 45 ఏళ్ల వ్యక్తి, హైదర్‌నగర్ డివిజన్‌కు చెందిన 51 ఏళ్ల మహిళ, జార్ఖండ్‌కు చెందిన 68 ఏళ్ల వృద్ధురాలు కూడా స్వైన్ ఫ్లూ సోకినట్లు తేలింది. వర్షం కారణంగా బురద, చెత్త పేరుకుపోయి, దోమలు, దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులలో రోగాల బారిపడే ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. స్వైన్ ఫ్లూ కారణంగా ప్రజల్లో భయం నెలకొనడం సహజం. రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.