H1N1: ఢిల్లీలో స్వైన్ ఫ్లూ కలకలం.. 8 రెట్లు పెరిగిన కేసులు, 1,777 మందికి వైరస్!
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలో స్వైన్ ఫ్లూ(H1N1)కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఆగస్టు 20 నాటికి దేశ రాజధానిలో 1,777 H1N1 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. గత ఏడాది ఇదే సమయానికి సుమారు 200 కేసులు మాత్రమే నమోదుకాగా.. ప్రస్తుతం ఆ సంఖ్య దాదాపు ఎనిమిది రెట్లు పెరిగింది. దీంతో ప్రముఖ ఆసుపత్రులైన అపోలో, మ్యాక్స్ వద్ద స్వైన్ ఫ్లూ లక్షణాలతో వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రతి 20 మంది ఓపీడీ రోగుల్లో దాదాపు 15 మందికి స్వైన్ ఫ్లూ పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోందని వైద్యులు చెబుతున్నారు. వైరస్‌లో జన్యు మార్పులు (జెనెటిక్ మ్యుటేషన్) లేదా ప్రజల మధ్య పెరిగిన సంబంధాల కారణంగా కేసులు ఈ స్థాయిలో పెరిగి ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
వివరాలు
ఇవీ ప్రధాన లక్షణాలు
H1N1 అనేది ముక్కు, గొంతు, ఊపిరితిత్తులపై ప్రభావం చూపే ఇన్‌ఫ్లుయెంజా 'ఏ' రకానికి చెందిన వైరల్ ఇన్ఫెక్షన్. జ్వరం, దగ్గు, తలనొప్పి, కండరాల నొప్పులు, తీవ్ర అలసట, చలి వంటి లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి.
చాలామంది రోగులు సాధారణ చికిత్సతోనే కోలుకుంటున్నప్పటికీ.. కొందరిలో న్యుమోనియా, ఆక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ARDS) వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
ముఖ్యంగా మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు, వృద్ధులు, గర్భిణులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
వివరాలు
నిర్ధారణ ఎలా? చికిత్స ఏంటి?
స్వైన్ ఫ్లూను నిర్ధారించేందుకు ఆర్‌టీ-పీసీఆర్ (RT-PCR), రాపిడ్ యాంటిజెన్ పరీక్షలను నిర్వహిస్తున్నారు.
చికిత్సలో ఆసెల్టామివిర్ అనే యాంటీవైరల్ ఔషధం ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
లక్షణాలు మొదలైన తొలి 48 గంటల్లో ఈ మందు తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుందని సూచిస్తున్నారు.
వైద్యుల సూచన లేకుండా యాంటీబయోటిక్స్ వాడకూడదని, జ్వరం వంటి లక్షణాలకు పారాసిటమాల్ తీసుకుని వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఏటా ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా వ్యాధి నుంచి రక్షణ పొందే అవకాశం పెరుగుతుందని చెబుతున్నారు.
అక్టోబర్ నెలలో వ్యాక్సిన్ తీసుకోవడం అనుకూల సమయమని వైద్యులు సూచిస్తున్నారు.
కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.