Loading...
Tamil Nadu Jailbreak: తమిళనాడులో జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్‌.. ఒకరు అరెస్ట్
తమిళనాడులో జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్‌.. ఒకరు అరెస్ట్

Tamil Nadu Jailbreak: తమిళనాడులో జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్‌.. ఒకరు అరెస్ట్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 27, 2026
08:07 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడు తేని జిల్లాలోని సబ్‌జైలు నుంచి 17 మంది ఖైదీలు పరారైన ఘటన కలకలం రేపింది. సోమవారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమై తేని నుంచి దిండిగల్‌ వరకు హైఅలర్ట్‌ ప్రకటించారు. పరారైన ఖైదీల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ఒక ఖైదీని తిరిగి అరెస్ట్‌ చేశారు. మిగిలిన వారి కోసం దాదాపు 16 ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఖైదీలు జైలు వెనుక ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్లి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

వివరాలు 

మూర్ఛ వచ్చినట్లు నటించి.. సిబ్బందిపై దాడి చేసి పరార్

జైలు నుంచి తప్పించుకునేందుకు ఖైదీలు పక్కా ప్రణాళికతో వ్యవహరించినట్లు తెలుస్తోంది.

ఒకే సెల్‌లో ఉన్న కొందరు ఖైదీల్లో ఒకరు మూర్ఛ వచ్చినట్లు నటించాడు. దీంతో అతడికి సాయం చేసేందుకు జైలు సిబ్బంది గదిలోకి వెళ్లారు.

ఇదే అదనుగా భావించిన ఖైదీలు సిబ్బందిపై దాడి చేసి అక్కడి నుంచి పారిపోయారు.

ఈ ఘటనలో గాయపడిన సిబ్బందిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

పరారైన ఖైదీలను పట్టుకునేందుకు 17 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సౌత్‌జోన్‌ ఐజీ విజయేంద్ర బిడారీ వెల్లడించారు.

వివరాలు 

1995 తర్వాత ఇదే అతిపెద్ద పరారీ ఘటన

తమిళనాడులో ఇంత పెద్ద సంఖ్యలో ఖైదీలు జైలు నుంచి తప్పించుకోవడం 1995 తర్వాత ఇదే తొలిసారి.

ఆ ఏడాది ఎల్‌టీటీఈ తీవ్రవాదులుగా అనుమానించిన 43 మంది ఖైదీలు వేలూరు కోటలో ఏర్పాటు చేసిన ప్రత్యేక నిర్బంధ కేంద్రం నుంచి పరారయ్యారు.

అప్పట్లో వారు 153 అడుగుల పొడవైన సొరంగాన్ని తవ్వి దాని ద్వారా బయటకు వెళ్లిపోయారు.

తాజాగా తేని సబ్‌జైలులో 17 మంది ఖైదీలు ఒకేసారి తప్పించుకోవడం రాష్ట్రంలో మరోసారి భద్రతా వ్యవస్థపై చర్చకు దారితీసింది.

ADVERTISEMENT