తమిళనాడు గవర్నర్ అర్ధరాత్రి ఉత్తర్వులు.. సెంథిల్ బాలాజీ మంత్రిగా కొనసాగుతారని నిర్ణయం
తమిళనాడు గవర్నర్ అర్ధరాత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. జైలు పాలైన మంత్రి సెంథిల్ బాలాజీని భర్తరఫ్ చేయాలన్న ఉత్తర్వులను నాటకీయ పరిణామాల మధ్య ఆర్ఎన్ రవి ఉపసంహరించుకున్నారు. మనీలాండరింగ్ కేసులో డీఎంకే మంత్రి సెంథిల్ బాలాజీ నిందితుడిగా ఉన్నారు. ఈ మేరకు గవర్నర్ గురువారం మంత్రిమండలి నుంచి తొలగించారు. అనంతరం అర్థరాత్రి సదరు ఉత్తర్వులను సవరిస్తూ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. తదుపరి సంప్రదింపుల జరిగే వరకు తొలగింపు ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపేయాలని నిర్ణయించారు. ఈ సమాచారాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్‌కూ తెలియజేశామని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. న్యాయపరమైన సలహాల కోసం గవర్నర్, అటార్నీ జనరల్‌ను సంప్రదించనున్నారని పేర్కొన్నాయి. ప్రస్తుతానికి బాలాజీ మంత్రిగానే కొనసాగనున్నట్లు స్పష్టం చేశాయి.
మంత్రి బాలాజీని తొలగించే అధికారం గవర్నర్ కు లేదు : సీఎం స్టాలిన్
మనీలాండరింగ్ కేసులో నిందితుడైన సెంథిల్ బాలాజీని గవర్నర్ ఆగమేఘాల మీద మంత్రిమండలి నుంచి తొలగించారు. అయితే కొన్ని గంటల తర్వాత అర్థరాత్రి నాటకీయ పరిణామం జరిగింది. పలువురు ఉద్యోగార్థుల నుంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకోవడం, మనీలాండరింగ్ వంటి అవినీతి కేసుల్లో సదరు మంత్రి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ కేబినెట్ నుంచి తొలగించారని, అది తక్షణమే అమల్లోకి వస్తుందని గురువారం రాజ్ భవన్ ప్రకటన రిలీజ్ చేసింది. మరోవైపు పోర్ట్ ఫోలియో లేకుండానే సెంథిల్ ను మంత్రిగా కొనసాగించారు. మంత్రి బాలాజీని తొలగించే అధికారం గవర్నర్ కు లేదని, చట్టపరంగా ఎదుర్కొంటామని సీఎం స్టాలిన్ వెల్లడించారు.