LOADING...
Kotamreddy Sridhar Reddy: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకి భారీ కుట్ర.. వైరల్ గా మారిన రౌడీ షీటర్ల సంభాషణ

Kotamreddy Sridhar Reddy: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకి భారీ కుట్ర.. వైరల్ గా మారిన రౌడీ షీటర్ల సంభాషణ

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 29, 2025
05:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డిపై భారీ హత్యా కుట్ర జరిగినట్టుగా సమాచారం అందింది. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వీడియోలో "కోటంరెడ్డిని చంపితే డబ్బే డబ్బు" అని స్పష్టంగా మాటలు వినిపిస్తున్నాయి. ఈ వీడియోలో తెలిపిన వివరాల ప్రకారం, ఎమ్మెల్యేను హతమార్చడానికి ఐదుగురు రౌడీషీటర్లు మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించినట్టు తెలుస్తోంది. ఈ కుట్ర లేడీ డాన్‌ నిడిగుంట అరుణ ద్వారా రౌడీషీటర్లు అవిలేల శ్రీకాంత్‌, జగదీష్ ఇతరులు పథకం రూపొందించినట్టు కోటంరెడ్డి వర్గీయులు గుర్తించారు. వీడియోతో పాటు ఇతర సాక్ష్యాలను కూడా సేకరించారు. ఈ ఘటనపై వెంటనే స్పందించడంతో కోటంరెడ్డి ప్రాణాలకు ముప్పు తొలగిందని చెబుతున్నారు.

వివరాలు 

ఎమ్మెల్యే కోరితే రక్షణ కల్పిస్తాం: ఎస్పీ 

ఇటీవల, కోటంరెడ్డి‌పై వైకాపా సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. కొంతమంది ప్రచారాల ప్రకారం, కోటంరెడ్డిని హత్య చేస్తే వచ్చే ఎన్నికల్లో గూడూరు లేదా సూళ్లూరుపేట ఎమ్మెల్యే టికెట్‌ అరుణకు వైకాపా కీలక నేత ఒకరు హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోందని సమాచారం. డబ్బుతో ప్రలోభపెట్టుతూ కోటంరెడ్డి అనుచరులను రౌడీషీటర్లు తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నించారని తెదేపా వర్గాలు ఆరోపిస్తున్నాయి. రౌడీషీటర్ల వీడియో రిలీజ్‌ అంశం తమ దృష్టికి రాలేదని నెల్లూరు ఎస్పీ శ్రీకాంత్‌ తెలిపారు. ఎమ్మెల్యేతో మాట్లాడతామని , ఆయన కోరితే భద్రత కల్పిస్తామని చెప్పారు.