
Alliance Airlines: అలయన్స్ ఎయిర్ విమానంలో సాంకేతిక లోపం.. శంషాబాద్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్!
ఈ వార్తాకథనం ఏంటి
విమాన ప్రమాదాలు, సాంకేతిక లోపాలతో వెనక్కి తిరగడం గతంలో అప్పుడప్పుడే జరిగేవి. అయితే ఇటీవల కాలంలో మాత్రం ఇవి దాదాపు ప్రతిరోజూ జరుగుతున్న ఘటనలుగా మారాయి. ఏకధాటిగా జరుగుతున్న లోపాలు, ప్రమాదాల గురించి విస్తృతంగా చర్చ జరుగుతున్నా.. విమానయాన సంస్థలు మాత్రం నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తున్నాయి. తాజాగా శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. శంషాబాద్-తిరుపతి మార్గంలో నడుస్తున్న అలియన్స్ ఎయిర్‌లైన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. రన్‌వేపైకి మూడు సార్లు వెళ్లి తిరిగి వచ్చిన విమానం ప్రయాణికుల ఆందోళనకు కారణమైంది. టేకాఫ్‌కు కొద్ది సేపటికే పైలట్ సమస్యను గుర్తించడంతో, వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి విమానాన్ని శంషాబాద్‌లోనే ఆపివేశారు.
Details
భయాందోళనలో ప్రయాణికులు
ఈ విమానంలో తిరుపతి వెళ్లాల్సిన 37 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. మూడుసార్లు రన్‌వేపైకి వెళ్లి తిరిగి రావడంతో ప్రయాణికులు విసుగుతో పాటు భయాందోళన వ్యక్తం చేశారు. ఇది ఒక్క ఘటన మాత్రమే కాదు. ఐదు రోజుల క్రితం కూడా ఇదే అలియన్స్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన మరో విమానంలో సాంకేతిక లోపం వెలుగుచూసింది. అప్పుడు తిరుపతి వెళ్లాల్సిన 67 మంది ప్రయాణికులు శంషాబాద్ విమానాశ్రయంలోనే గంటల తరబడి ఆగిపోవాల్సి వచ్చింది. ఆ సందర్భంలో పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది. కానీ వరుసగా సాంకేతిక లోపాలు బయటికొస్తుండడంతో ప్రయాణికుల్లో భయం, ఆందోళన పెరుగుతోంది.